Writer Padmabhushan: ఆ ప్రీమియర్‌లో ప్రేక్షకుల స్పందన చూసి ఏడ్చేశా: టీనా

‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రంతో టీనా శిల్పరాజ్‌ కథానాయికగా పరిచయంకాబోతున్నారు. ఫిబ్రవరి 3న సినిమా విడుదలకానున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

Published : 30 Jan 2023 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుహాస్‌ (Suhas) హీరోగా కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan). టీనా శిల్పరాజ్‌ (Tina Shilparaj) కథానాయికగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా టీనా.. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘హాయ్.. నా పేరు టీనా శిల్పరాజ్‌. పేరు చూసి నేను ఇక్కడి దాన్ని కాననుకుంటే పొరపాటే. నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్‌. ఓ సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేశా. దాంతో, సినిమాపై అవగాహన వచ్చింది. నాలోని నటిని బయటకు తీసుకొచ్చి, చాలామందిలానే నేనూ ‘రైటర్‌ పద్మభూషణ్‌’ సినిమాకు ఆడిషన్‌ ఇచ్చా. తర్వాత హీరో సుహాస్‌తో లుక్‌ టెస్ట్‌లో పాల్గొన్నా. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం నాకే వస్తుందని బలంగా నమ్మా. అనుకున్నది జరిగిందనందుకు ఎంతో సంబరపడ్డా. నేను నటించాననికాదు కానీ ఈ చిత్రం ఎమోషనల్‌ రైడ్‌. కామెడీ కూడా ఉంటుంది. చూశాక ఇది మంచి ఫీల్‌ గుడ్‌ సినిమా అని మీరే చెబుతారు’’

‘‘నేనిందులో విజయవాడకు చెందిన సారిక అనే యువతి పాత్రలో కనిపిస్తా. కథలో కీలకమైన క్యారెక్టర్‌ నాది. ట్రైలర్‌ చూసిన వారంతా నా పాత్రను మెచ్చకున్నారంటే దానికి కారణం దర్శకుడు ప్రశాంతే. ఈ సినిమా ప్రీమియర్స్‌కీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. విజయవాడ ప్రీమియర్‌ సమయంలో నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. గుంటూరు, భీమవరంలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. దాన్ని చూసినప్పుడు మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అనిపించింది.’’

‘‘సుహాస్‌ ప్రతిభావంతుడు. తను నటించిన ‘కలర్‌ ఫోటో’ చిత్రం నాకు చాలా ఇష్టం. ఇప్పుడాయన పక్కన నటించి, మీ అందరికీ పరిచయం కావడం ప్రత్యేకం. ఓ నటిగా నా బలమేంటో? బలహీనతేంటో? తొలి సినిమాతోనే తెలుసుకోగలిగా. రోహిణి, ఆశిష్‌ విద్యార్థివంటి సీనియర్‌ నటులతో కలిసి చేయడం మర్చిపోలేని జ్ఞాపకం. ప్రశాంత్‌ విజన్‌ ఉన్న దర్శకుడు. ఆయన వ్యక్తిత్త్వం కథలో ప్రతిబింబిస్తుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుంటుంది ఛాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంస్థ. ఈ సినిమాకు మీరందరూ కనెక్ట్‌ అవుతారనే నమ్మకం ఉంది. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూస్తారు కదూ..!’’ - టీనా శిల్పరాజ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు