Writer Padmabhushan: ఓటీటీలో ‘రైటర్‌ పద్మభూషణ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Writer Padmabhushan ott: సుహాస్‌ కీలక పాత్రలో నటించిన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది.

Published : 08 Mar 2023 15:00 IST

హైదరాబాద్‌: సుహాస్‌, టీనా శిల్పరాజ్‌ జంటగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాదు, ఫీల్‌గుడ్‌ మూవీగా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా(Writer Padmabhushan ott) స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ‘రైటర్‌ పద్మభూషణ్‌’ ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

క‌థేంటంటే: ప‌ద్మభూష‌ణ్ అలియాస్ భూష‌ణ్‌ (సుహాస్‌) (Suhas) విజ‌య‌వాడ‌కి చెందిన ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. ఓ గ్రంథాల‌యంలో అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌గా ప‌ని చేస్తుంటాడు. ఎప్పటికైనా రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ అనిపించుకోవాల‌నేది అత‌ని క‌ల‌. అందుకోసమని ఇంట్లో వాళ్లకి తెలియ‌కుండా ల‌క్షలు అప్పు చేసి తొలి అడుగు పేరుతో ఓ బుక్ రాస్తాడు. కానీ, పాఠ‌కుల‌తో ఆ బుక్‌ని చ‌దివించ‌డానికి ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటాడు. కాపీలు అమ్ముడుపోక ఇంటికి తిరిగి తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి. అప్పులకి వ‌డ్డీలు క‌ట్టలేక‌, కాపీలు అమ్ముడుపోక స‌త‌మ‌త‌మ‌వుతున్న ద‌శ‌లో ప‌ద్మభూష‌ణ్ పేరుతో వెలువ‌డిన మ‌రో కొత్త పుస్తకానికీ, అదే పేరుతో ఏర్పాటైన బ్లాగ్‌కి మంచి పేరొస్తుంది. ఎప్పుడో దూర‌మైన బాగా డ‌బ్బున్న మేన‌మామ త‌న కూతురు సారిక (టీనా శిల్పరాజ్‌)ని ఇచ్చి పెళ్లి  చేయ‌డానికి ముందుకొస్తాడు. ఊహించ‌ని ఆ ప‌రిణామం భూష‌ణ్ త‌ల్లిదండ్రుల‌కి ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని దూరం చేయలేక‌, తను రాయ‌క‌పోయినా త‌నే ర‌చ‌యిత అని చెబుతూ పెళ్లికి సిద్ధమ‌వుతాడు భూష‌ణ్‌. ఇంత‌లోనే ఆ బ్లాగ్‌లో వ‌రుస‌గా వ‌స్తున్న కంటెంట్ ఆగిపోతుంది. దాంతో అస‌లు విష‌యాన్ని త‌నకి కాబోయే భార్యకి చెప్పాల‌నుకున్న భూష‌ణ్ ఆ ప‌ని చేశాడా? లేదా? వీళ్లిద్దరి పెళ్లి జరిగిందా? ఇంత‌కీ రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ పేరుతో ర‌చ‌న‌లు చేసిందెవ‌రు? అస‌లు ఆ పేరుని వాడుకోవాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది? అజ్ఞాతంలో ఉన్న ఆ ర‌చయిత‌ని ప‌ట్టుకునేందుకు భూష‌ణ్ ఎన్ని పాట్లు ప‌డ్డాడన్నది మిగతా క‌థ‌ .

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని