Sai Madhav Burra: స్ఫూర్తినిచ్చే ‘వీరసింహారెడ్డి’.. ఫుల్‌ ప్యాకేజ్‌ ఇది: సాయిమాధవ్‌

రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఇంటర్వ్యూ. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలు చదివేయండి..

Published : 30 Dec 2022 21:07 IST

హైదరాబాద్‌: ‘అది కల.. నిద్రలో కనేది. ఇది కళ.. నిద్ర లేపేది’, ‘బరువు, బాధ్యతలు చూసేవాడికి తెలియదు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది’, ‘చంపడమో చావడమో ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం’.. ఇలా ఎన్నో సంభాషణలతో రచయితగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయిమాధవ్‌ బుర్రా. బయోపిక్‌, హిస్టారికల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, రొమాంటిక్‌.. ఇలా నేపథ్యం ఏదైనా అలతి పదాలతో డైలాగ్స్‌ రాసి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతుంటారాయన. సాయిమాధవ్‌ మాటలు రాసిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన సినిమా ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.

* దర్శకుడు మీకు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిన పాయింట్‌?

సాయిమాధవ్‌: ‘వీరసింహారెడ్డి’ కథ వినగానే నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ స్టోరీలోని ఎమోషన్‌ అందరినీ కట్టిపడేస్తుంది. ఓ పాయింట్‌ కాదు కథే కొత్తది. ప్రేక్షకులు ఇంతకుముందు చూడని అంశాలు ఇందులో ఉంటాయి. మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ.. అన్ని వర్గాల వారిని మెప్పించే కంటెంట్‌ ఇది. ‘వీరసింహారెడ్డి’ ఫుల్‌ ప్యాకేజ్‌. ఇందులో పక్కా మాస్‌ డైలాగ్స్‌ ఉంటాయి. ఈ చిత్రానికి సంభాషణలు రాసేందుకు 2 నెలలు పట్టింది.

* సంభాషణలు రాసేటపుడు ఒత్తిడికి గురయ్యారా?

సాయిమాధవ్‌: అలాంటిదేం లేదండీ. గతంలో.. బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’ చిత్రాలకు పనిచేశా. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’. నేనెప్పుడూ టెన్షన్‌ పడను. ఒత్తిడికి లోనైతే ఔట్‌పుట్‌ అనుకున్నంత పర్‌ఫెక్ట్‌గా రాదనేది నా నమ్మకం. కథా చర్చల దశ నుంచి నేను ఈ సినిమాతో ప్రయాణించా. కథ, పాత్ర, సన్నివేశాన్ని మాత్రమేకాకుండా హీరో ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రాశా.

* ‘వీరసింహారెడ్డి’ మీకు సవాలు విసిరిందా?

సాయిమాధవ్‌: ఈ కథే కాదు నాకు ప్రతి కథా సవాలే. స్టోరీలోని సోల్‌ని హైలైట్‌ చేసేందుకు ప్రతి రచయిత కష్టపడతాడు. ‘వీరసింహారెడ్డి’.. థీమ్‌ వింటే ఎవరైనా స్ఫూర్తిపొందుతారు. పక్కా కమర్షియల్‌ హంగులతో ఇలాంటి కథ తెరకెక్కడం అరుదు.

* దర్శకుడు గోపిచంద్ మలినేనితో పని చేయడం ఎలా అనిపించింది?

సాయిమాధవ్‌: గోపీచంద్‌తో నాకిది రెండో చిత్రం. మేం స్నేహితులం. ఆయన ఇప్పుడు అగ్ర దర్శకుడిగా ఉండడం సంతోషం. భవిష్యత్తులో ప్రపంచమంతా మాట్లాడుకునే స్థాయిలో ఉంటారాయన. తనకు కన్విన్స్‌ అవడం, కన్విన్స్‌ చేయడం రెండూ తెలుసు. గొప్ప దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలివి.

* బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, చిరంజీవి ‘ఖైదీ నంబరు 150’ చిత్రాలు 2017 సంక్రాంతి బరిలో నిలిచాయి. 2023 సంక్రాంతికి మరోసారి వారిద్దరి సినిమాలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు?

సాయిమాధవ్‌: బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర..’, చిరంజీవి ‘ఖైదీ నంబరు 150’ చిత్రాలకు సంభాషణలు నేనే రాశా. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలవడం మరిచిపోలేని జ్ఞాపకం. మరోసారి వారిద్దరి చిత్రాలు పండక్కి వస్తుండం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కు నేను పనిచేయకపోయినా అదీ నాదే అని భావిస్తా. ఆ సినిమా దర్శకుడు బాబీ నా స్నేహితుడు.

దాని గురించి భవిష్యత్తులో ఆలోచిస్తా..

దర్శకత్వం చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. రచయితకావాలని ఇండస్ట్రీలోకి వచ్చా. అనుకున్నట్టుగానే రచయితనయ్యా. రచనపైనే నా దృష్టంతా. భవిష్యత్తులో ఓ కథని దర్శకుడిగా చెప్పాలనిపించినపుడు దాని గురించి ఆలోచిస్తా.

చేతిలో ఉన్న చిత్రాలు..

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌), పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా, అర్జున్‌ డైరెక్ట్‌ చేస్తున్న చిత్రం, నిర్మాత కె. ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఓ సినిమాకు పనిచేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని