భాషపై ప్రేమ... మన బాధ్యత

పేరు మొదలుకొని మాట... పాట వరకు మన సినిమాల్లో పరభాష ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. వ్యాపార ధోరణి, సమాజ పోకడ అందుకు కారణం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ మన రచయితలు భాషపై ప్రత్యేక దృష్టి పెడుతూ తెలుగు...

Published : 21 Feb 2021 12:19 IST

హైదరాబాద్‌: పేరు మొదలుకొని మాట... పాట వరకు మన సినిమాల్లో పరభాష ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. వ్యాపార ధోరణి, సమాజ పోకడ అందుకు కారణం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ మన రచయితలు భాషపై ప్రత్యేక దృష్టి పెడుతూ తెలుగు దనాన్ని బలంగా వినిపించేలా చేస్తుంటారు. అలా భాషపై మమకారం చాటే రచయితల్లో అబ్బూరి రవి ఒకరు. ఇటీవల ‘నాంది’తో మరోసారి ఆయన తనవైన మాటలతో అలరించారు. ఆదివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈ రోజు. తెలుగు సినిమా మాట... పాట మన మాతృభాషపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటారు?

సినిమా తెలియని గడపంటూ ఉండదు మనకి. సమాజంపై సినిమా ప్రభావం బలంగా ఉంటుంది. ఓ సినిమా గుర్తుకొచ్చిందంటే అందులో పాటో మాటో మదిలో మెదిలేలా చేస్తుంది. మన అనే భావన కలిగేలా చేస్తుంది. అందుకే సాధ్యమైనంత సంస్కారవంతంగా, మాటల్ని మాతృభాషలో రాయడానికే ప్రయత్నిస్తుంటా. పిల్లలు యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ ఇంగ్లీష్‌ మాట్లాడేస్తున్న రోజులివి. వాళ్లకి మన మాతృభాష తెలుగుమీద ప్రేమ పుట్టేలా చేయడం మన బాధ్యత. అమ్మ, నాన్న లేని వాడు అనాథ అయితే - మాతృభాష రాని వాడూ అంతే. అలాగని ఇతర భాషలు నేర్చుకోవద్దని ఎవరూ చెప్పరు. మాతృభాష మన గుర్తింపు.

మాతృభాష పరిరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు?

తెలుగు నేర్చుకోవాలి అన్నది ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. తెలుగు భాషా ప్రావీణ్యులకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. లేకపోతే తెలుగు నేర్చుకొని, చదువుకొని ఏం చేయాలి? ఇంగ్లిష్‌ మాట్లాడితేనే గౌరవం ఇస్తున్నప్పుడు’ అనే ప్రశ్న తలెత్తుతుంది. మన సాహిత్యం, మన కవులు, మన ప్రాశస్త్యం గురించి పిల్లలకి పాఠశాల స్థాయి నుంచే తెలిసేలా చేయడం చాలా అవసరం.

‘నాంది’తో మరోసారి మీ కలం బలాన్ని  చూపారు. ఈ సినిమా మాటల కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

ఒక చక్కటి కథా వస్తువుతో నా దగ్గరకి వచ్చారు దర్శకుడు విజయ్, రచయిత వెంకట్‌. ఒక కొత్త అంశాన్ని స్పృశిస్తూ సాగే కథ ఇది. ఇప్పటి వరకు నేను ‘బొమ్మరిల్లు’లాంటి కుటుంబ కథా చిత్రాలకి రాశాను. ‘ఎవడు’, ‘డాన్‌’, ‘పంజా’ తదితర మాస్‌ సినిమాలు, ‘క్షణం’, ‘ఎవరు’ వంటి థ్రిల్లర్‌ చిత్రాలు, ‘గూఢచారి’లాంటి స్పై యాక్షన్‌ థ్రిల్లర్లతోపాటు హారర్‌ సినిమాకి కూడా రాసాను. కానీ ఒక కోర్ట్‌ డ్రామా సినిమాకి పనిచేసే అవకాశం మొదటిసారి ‘నాంది’ రూపంలో వచ్చింది. అల్లరి నరేష్‌ సినిమాకి రాయడమూ ఇదే తొలిసారి. ఇలాంటి సామాజికాంశాలతో కూడిన చిత్రాలకి పనిచేసేటప్పుడు -  ఏ మాట రెచ్చగొట్టే మాట కాకూడదు అనుకుంటాను. అందరినీ ఆలోచింపజేయాలి, ఇంటికి వెళ్లాక నా మాట గుర్తుండాలి అనుకుంటాను. మన జీవితం అలాగే సమాజం తాలూకు ఆలోచనా విధానాన్ని మార్చే మాట రాయగలిగే అవకాశం రావడం అనేది అదృష్టమే అని నమ్ముతాను.

దర్శకత్వం తప్పకుండా చేస్తాను. నేను చేయబోయే సినిమా కోసం కథలూ రాసుకున్నా. ప్రస్తుతం మాటల రచయితగా చేస్తున్నవి పూర్తవ్వగానే, నా కథలకి స్క్రీన్‌ప్లే, మాటలు రాసుకుని బౌండెడ్‌ స్క్రిప్టుతో పని మొదలు పెడతా. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ ‘గని’, అడవి శేష్‌ ‘మేజర్‌’ సినిమాలకు రాస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని