Yakshini review: రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

Yakshini review in telugu: వేదిక, రాహుల్‌ విజయ్‌, మంచు లక్ష్మీ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 25 Jun 2024 16:20 IST

Yakshini review; వెబ్‌సిరీస్‌: యక్షిణి; నటీనటులు: రాహుల్‌ విజయ్‌, వేదిక, మంచు లక్ష్మి, అజయ్‌, శ్రీనివాస్‌, తేజ కాకుమాను, దయానందరెడ్డి, ప్రవీణ్‌, జెమినీ సురేశ్‌ తదితరులు; సంగీతం: ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యం; సినిమాటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి; ఎడిటింగ్‌: కార్తికేయన్‌ రోహిణి; నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని; వీఎఫ్‌ఎక్స్‌: జునైద్‌ ఉల్లహ్‌; దర్శకత్వం: తేజ మర్ని; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

సినిమాలకు దీటుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి వెబ్‌సిరీస్‌లు. అందుకు తగినట్లే అత్యాధునిక హంగులతో సరికొత్త జానర్స్‌లో సిరీస్‌లను తీసుకొస్తున్నారు దర్శక-నిర్మాతలు. అలా డిస్నీ+హాట్‌స్టార్‌లో వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’. తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌ ఎలా ఉంది?(Yakshini review in telugu) పురాణాల్లో మాత్రమే కనిపించే ‘యక్షిణి’ పాత్రను ఎలా ఆవిష్కరించారు?

కథేంటంటే: మాయ (వేదిక) ఒక యక్షిణి. శాపం కారణంగా భూమిపై ఉండాల్సి వస్తుంది. తమో రజో గుణంతో వందమంది పురుషులను అనుభవించి, వారిని హతమార్చిన తర్వాతే ఆమెకు శాపవిమోచనం కలుగుతుంది. 99 మందిని అలాగే హత్య చేస్తుంది. అయితే, 100వ వ్యక్తి మాత్రం నిష్ట కలిగిన బ్రహ్మచారి అయి ఉండాలన్నది షరతు. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతున్న తరుణంలో కృష్ణ (రాహుల్‌ విజయ్‌) పరిచయం అవుతాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడు. మరోవైపు క్షుద్ర, తాంత్రిక విద్యలతో యక్షిణిని వశం చేసుకోవాలని ఎదురు చూస్తుంటాడు మహాకాల్‌ (అజయ్‌). మరి యక్షిణితో పరిచయం అయిన తర్వాత కృష్ణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? (Yakshini review in telugu) ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? మహాకాల్‌ ఎందుకు యక్షిణిని వశం చేసుకోవాలని చూస్తున్నాడు? ఇవన్నీ తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: పురాణాల్లో పాత్రల ఇతివృత్తంగా సినిమాలను తెరకెక్కించడం తెలుగు తెరకు కొత్తేమీ కాదు. మారిన పరిస్థితులకు వాటిని అన్వయించుకుంటూ రూపొందిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనేందుకు ‘బింబిసార’లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే, కథ చెప్పే విషయంలో ఎంత కన్విన్సింగ్‌గా చెప్పామన్న దానిని బట్టే విజయం ఆధారపడి ఉంటుంది. ‘యక్షిణి’ అనే చందమామ కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు తేజ మర్ని మంచి ప్రయత్నం చేశారు. ఇక్కడ కథ మూడు కోణాల్లో నడుస్తుంది. 1. బ్రహ్మచర్యం నిష్టగా పాటించే వ్యక్తిని అనుభవించి చంపడం ద్వారా తన శాపాన్ని విమోచన చేసుకోవాలనుకునే యక్షిణి మాయ.. 2. భూమ్మీద ఉన్న యక్షిణిని ఎలాగైనా వశం చేసుకోవాలనుకునే మహాకాల్‌..  3.తన కలల రాకుమారితో జీవితాన్ని గడపాలనుకునే సగటు కుర్రాడు కృష్ణ.. ఇలా మూడు పాత్రలను కనెక్ట్‌ చేస్తూ సిరీస్‌ను నడిపాడు. ప్రతీ ఎపిసోడ్‌ ముందు అలకాపురి దాని చరిత్ర, యక్షిణులు ఎవరు వారి గతం ఏంటి? నాగలోకానికి, యక్షలోకానికి మధ్య ఉన్న వైరం. యక్షిణి భూమ్మీదకు రావడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ సిరీస్‌ను తీర్చిదిద్దారు. యక్షిణి పాత్ర, ఆమె శాపాన్ని పరిచయం చేస్తూ సన్నివేశాలను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా మూడు ప్లాట్‌లను సమాంతరంగా చూపిస్తూ వెళ్లాడు. యక్షిణి అందం చూసి ఆమెతో ప్రేమలో పడిన కృష్ణ చావకుండా ఎలా బయటపడతాడా? అన్న ఉత్కంఠతో సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. (Yakshini review in telugu) యక్షిణిని వశం చేసుకోవడానికి మహాకాల్‌ వేసే ప్లాన్‌లను కూడా ఆసక్తికరంగా చూపించారు. అయితే, కొన్నిసార్లు మరీ లాజిక్‌కు దూరంగా నడిపిన సన్నివేశాలు తేలిపోయాయి. మూడో ఎపిసోడ్‌లో జ్వాలాముఖి( మంచు లక్ష్మి) పాత్రతో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. థ్రిల్లింగ్‌గా సాగే సిరీస్‌లో మధ్యలో కృష్ణ కుటుంబం చేసే హంగామా సాగదీత వ్యవహారంలా అనిపిస్తుంది. ఒక సీరియస్‌ మోడ్‌లో సాగుతున్న సిరీస్‌ స్పీడ్‌ బ్రేకర్‌ వేసినట్లు అనిపిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ సాగుతున్న కొద్దీ పాత్రలు వాటి నేపథ్యాలు మరింత బలంగా చూపించాల్సింది పోయి, సన్నివేశాలు, పాత్రలు పలుచబడిపోయాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ పాత్రల మధ్య సంఘర్షణ తగ్గిపోతూ వచ్చింది. ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్స్‌లో అనవసరంగా కామెడీని ఇరికించారు. ప్రధాన పాత్రలకు ఎమోషన్స్‌ జొప్పించి ప్రేక్షకులకు కనెక్ట్‌ చేయాలని చూసినా అవి కూడా అంతగా రక్తి కట్టలేదు. చివరి ఎపిసోడ్‌ ‘విరూపాక్ష’, ‘అంజి’ సినిమాలు గుర్తుకు వస్తాయి.

ఎవరెలా చేశారంటే: యక్షిణిగా మాయ పాత్రలో వేదిక అందంగా కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టింది. యక్షిణిని వశం చేసుకునే మాంత్రికుడిగా మహాకాల్‌గా అజయ్‌ వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. జ్వాలముఖిగా మంచు లక్ష్మి ట్విస్ట్‌ ఇచ్చే పాత్ర. సిరీస్‌లో ఆమే కీలకం. యక్షిణిని ప్రేమించే యువకుడిగా రాహుల్‌ విజయ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలినవాళ్లు తమ పరిధి మేరకు నటించారు.  సాంకేతికంగా సిరీస్ బాగుంది. వీఎఫ్‌ఎక్స్‌ బడ్జెట్‌ పరిమితుల మేరకు ఉన్నాయి. (Yakshini review in telugu) దర్శకుడు తేజ మర్ని చందమామ కథను ఎంచుకుని, నేటి తరానికి అనుగుణంగా తీర్చిదిద్దిన విధానం కొంత వరకూ బాగుంది. తొలి ఎపిసోడ్స్‌లో యక్షిణి, నాగలోకం అంటూ బలంగా కథను ప్రారంభించిన తేజ, క్లైమాక్స్‌ వచ్చే సరికి కథ, పాత్రల్లో సంఘర్షణ తగ్గిపోయి, రొటీన్‌ మూవీని చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇలాంటి కథలను చూసేటప్పుడు లాజిక్‌లు వెతక్కుండా చూస్తే, సినిమా/సిరీస్‌ను పూర్తిగా ఆస్వాదించగలమన్నది వాస్తవమే అయినా, కొన్ని సన్నివేశాలు మరీ లాజిక్‌కు దూరంగా ఉంటాయి. అవేంటో మీరు సిరీస్‌ చూస్తున్నప్పుడు సులభంగానే గుర్తిస్తారు.

కుటుంబంతో చూడొచ్చా: అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేకపోయినా అక్కడక్కడా ముద్దు సన్నివేశాలున్నాయి. నిడివి కూడా తక్కువే. ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 30-35 నిమిషాలు ఉండటం రిలీఫ్‌. ఫాంటసీ డ్రామాతో కూడిన కథలను ఇష్టపడేవారికి మాత్రం ‘యక్షిణి’ నచ్చుతుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • బలాలు
  • + కథ, తొలి మూడు ఎపిసోడ్స్‌
  • + నటీనటులు
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - చివరి రెండు ఎపిసోడ్స్‌
  • - కొన్నిచోట్ల పూర్తిగా లాజిక్‌ మిస్సవటం
  • చివరిగా: బలంగా మొదలై బలహీనంగా ముగిసిన యక్షిణి (Yakshini review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని