Yash: ఆరోజు అందరూ నన్ను చులకనగా చూసి నవ్వారు: యశ్‌

యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇది..! 

Updated : 06 Apr 2022 13:01 IST

బస్‌ డ్రైవర్‌ కొడుకు నుంచి స్టార్‌ హీరోగా ఎదిగిన రాఖీబాయ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రాఖీబాయ్‌.. తల్లికిచ్చిన మాట ప్రకారం మహారాజుగా ఎదిగి ఈ ప్రపంచాన్నే ఏలడం కోసం ఎదురొచ్చిన ఎన్నో కష్టాలపై తిరుగులేని పోరాటం చేశాడు. ఈ పోరాటాన్నే ‘కేజీఎఫ్‌’ వేదికగా కళ్లకు కట్టినట్లు చూపించారు నటుడు యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కింది. పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో యశ్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యశ్‌.. స్టార్‌ హీరోగా ఎలా ఎదిగాడు? తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఇలా ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

మా నాన్న బస్ డ్రైవర్‌.. మాదొక మధ్య తరగతి కుటుంబం..!

కర్ణాటకలోని హసన్‌లో నేను జన్మించాను. మా నాన్న సొంతూరు మైసూర్‌ కావడంతో చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. అప్పట్లో మా నాన్న బీఎంటీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారు. మాదొక సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఎందుకో తెలియదు.. చిన్నతనం నుంచి నా దృష్టంతా సినిమాల పైనే ఉండేది. ఎలాగైనా సినిమాల్లో నటించాలని ఎన్నో కలలు కన్నాను. సినీ పరిశ్రమలో నాకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను.

అదే నా తొలి అడుగు..!

నటుడిగా అడుగుపడాలంటే ముందు మనలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. దీంతో మన టాలెంట్‌ని ఎలాగైనా బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. దాని కోసం స్కూల్‌లో జరిగే ఫ్యాన్సీ డ్రెస్‌, డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొనేవాడిని. పోటీల్లో విజయం సాధించినా, సాధించలేకపోయినా.. కేవలం పాల్గొన్నందుకే ఎంతో సంతోషించేవాడిని. అలా, తొలి అడుగులు వేశా.

అందరూ చులకనగా నవ్వారు..!

హీరో కావాలనే ఆశ నాలో ఎంతలా ఉండేదంటే స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో ఎవరైనా నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? అని అడిగితే.. క్లాస్‌లో ఉన్నవాళ్లందరూ టీచర్‌, పోలీస్‌, లాయర్‌, ఇంజినీర్‌.. ఇలా ఏవేవో చెప్పేవాళ్లు. నేను మాత్రం ‘హీరో కావాలనుకుంటున్నా’ అని ధైర్యంగా చెప్పేవాడిని. నా మాట విని క్లాస్‌లో ఉన్నవాళ్లందరూ నవ్వేవాళ్లు. వాళ్లు అలా నవ్వుతున్నందుకు కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. ‘‘తప్పకుండా ఏదో ఒకరోజు హీరో అవుతా’’ అని మనసులో నాకు నేనే చెప్పుకునేవాడిని.

యశ్‌ ఫ్యామిలీ పిక్‌

హీరో అనేవాళ్లు..!

స్కూల్‌లో ఏ ఫంక్షన్‌ జరిగినా తప్పకుండా నేను ఏదో ఒక ప్లే చేసేవాడిని. కనీసం డ్యాన్స్‌ ప్రదర్శన అయినా ఇచ్చేవాడిని. అలా, సినిమాపై నాకున్న ఆసక్తి కొంతకాలంలోనే అందరికీ అర్థమైపోయింది. దాంతో స్కూల్‌లో టీచర్లు అందరూ నన్ను హీరో అని పిలిచేవారు. వాళ్లు అలా పిలుస్తుంటే నాకెదో తెలియని ఆనందం. ఏదో సాధించేశాననే భావన కలిగేది.

ఇంట్లో నుంచి వెళ్లిపోయా..!

నటుడిగా రాణించాలంటే ఏదో ఒక ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్‌ చేయాలని తెలిసింది. అదే విషయాన్ని నా తల్లిదండ్రులకు చెబితే.. ‘‘నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? సినిమా అనేది మంచిది కాదు. ముందు నువ్వు డిగ్రీ పూర్తి చెయ్‌’’ అన్నారు. ఇంటర్‌ పూర్తి చేసిన వెంటనే ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని గట్టి నిర్ణయం తీసుకున్నా. దానికి అమ్మవాళ్లు ఎంతో బాధపడ్డారు. ‘నువ్వు మా మాట వినడం లేదు’ అన్నారు. ఫిల్మ్‌ కోర్స్‌ చేయడానికి సరిపడా డబ్బులు నా వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక ఒక థియేటర్‌ గ్రూప్‌లో చేరాను. ఇంటిని వదిలి వెళ్లిపోయాను. ‘‘సరే వెళ్లు. ఒకవేళ నువ్వు కనుక తిరిగి ఇంటికి వచ్చేస్తే.. మళ్లీ ఆ రంగంవైపు వెళ్లనని మాటివ్వు’’ అని అమ్మవాళ్లు అనడంతో ‘‘సరే అయితే. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను సాధించి చూపిస్తా’’ అని చెప్పి బెంగళూరుకు వచ్చేశా. అలా, కొన్నాళ్లు బ్యాక్‌స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశా. కొన్నేళ్లపాటు కష్టపడి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. ఇప్పుడు మీ అందరి మన్ననలు పొందుతున్నా.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts