KGF Chapter 2: ఆ నమ్మకంతోనే ‘కేజీయఫ్‌’ తీసుకొచ్చాం.. తన వల్లే నేను మీ ముందున్నా: యశ్‌

కథ నచ్చితే ఏ చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే ‘కేజీయఫ్‌’ను ఇక్కడ విడుదల చేశామని కన్నడ నటుడు యశ్‌ అన్నారు. ఈయన హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’కు కొనసాగింపుగా రూపొందింది.

Updated : 11 Apr 2022 23:37 IST

హైదరాబాద్‌: కథ బాగుంటే ఏ చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే ‘కేజీయఫ్‌ 1’ను ఇక్కడ విడుదల చేశామని కన్నడ నటుడు యశ్‌ అన్నారు. ఈయన హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ రూపొందింది. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా యశ్‌ మాట్లాడుతూ.. ‘‘కథ నచ్చితే ఏ సినిమానైనా మీరు (తెలుగు ప్రేక్షకులు) ఆదరిస్తారనే నమ్మకంతోనే ‘కేజీయఫ్‌ 1’ను మీ ముందుకు తీసుకొచ్చాం. తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు అంటే నాకెంతో ప్రేమ, గౌరవం. ప్రశాంత్‌ నీల్‌ లేనిదే నేనీ రోజు మీ ముందు ఉండేవాడిని కాదు. అతని ప్రతిభ ఎలాంటిదో మీకూ తెలుసు. కన్నడ సినీ పరిశ్రమ గర్వంగా చెప్పుకొనే దర్శకుడాయన. నిర్మాత కిరంగదూర్‌ సైతం ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలనే ఆలోచనతోనే ఉండేవారు. దర్శకనిర్మాలతోపాటు సాంకేతిక నిపుణులు, నటుల సమష్టి కృషి వల్లే ‘కేజీయఫ్‌’ సాధ్యమైంది’’.

‘‘తెలుగు వెర్షన్‌ విషయానికొస్తే.. సాయి కొర్రపాటి ఎంతో కష్టపడి ‘ఛాప్టర్‌ 1’ను విడుదల చేశారు. ఆయనకు, సహకారం అందించిన రాజమౌళి, శోభు యార్లగడ్డకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. హనుమాన్‌.. స్ట్రైయిట్‌ తెలుగు సినిమాకు కష్టపడినట్టే ఈ చిత్రానికి డబ్బింగ్‌ వ్యవహారాలు చూశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఏదో పవర్‌ ఉంటుంది. మేం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని పాటల ద్వారా తెలియజేస్తారాయన. మాస్‌+ పోయెట్రీ కాంబినేషన్‌ రిలిక్స్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఛాప్టర్‌ 1లానే ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యశ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ నీల్‌, కథానాయిక శ్రీనిధి శెట్టి, నిర్మాత దిల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని