Yashoda Review: రివ్యూ: యశోద
‘యశోద’ రివ్యూ (Yashoda Review). సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Yashoda Review చిత్రం: యశోద, నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు, సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్, కళ: అశోక్, పోరాటాలు: వెంకట్, యానిక్ బెన్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాణం: శివలెంక కృష్ణప్రసాద్. దర్శకత్వం: హరి - హరీష్,
సంస్థ: శ్రీదేవి మూవీస్, విడుదల: 11 నవంబర్ 2022.
కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలకి కేరాఫ్‌గా మారారు సమంత. తొలినాళ్లలో గ్లామర్ తారగా సందడి చేసినా... కొన్నాళ్లుగా తనలోని నటిని ఆవిష్కరించేలా కథల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ‘యూ టర్న్‘, ‘ఓ బేబి’ చిత్రాల తర్వాత మళ్లీ ఆమె చేసిన నాయికా ప్రధానమైన చిత్రం.. ‘యశోద’. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటించడమే కాదు...పోరాటాలూ చేశారు. సినిమా పూర్తయ్యే క్రమంలో అనారోగ్యంతో ఇబ్బందిపడినా సరే.. డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. పాన్ ఇండియా స్థాయిలో మంచి ప్రచారం, అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం...
కథేంటంటే?
యశోద (సమంత) మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆర్థిక అవసరాల రీత్యా సరోగసి పద్ధతిలో బిడ్డకి జన్మనివ్వడం కోసం డా.మధు (వరలక్ష్మి శరత్‌కుమార్)కి చెందిన ఈవా ఆస్పత్రిలో చేరుతుంది. ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపించే ఈవాలో జరిగే కొన్ని పరిణామాలు యశోదలో అనుమానం రేకెత్తిస్తాయి. తనతోపాటు బిడ్డలకి జన్మనివ్వడం కోసం ఆస్పత్రిలో చేరిన తోటి మహిళలు అనుమానాస్పద రీతిలో కనుమరుగైపోతుంటారు. ఇంతకీ ఆ మహిళలు ఏమవుతున్నారు? యశోద తన అనుమానాల్ని నివృత్తి చేసుకోవడం కోసం ఏం చేసింది? ఆ ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి విషయాలు తెలిశాయి? ఇంతకీ ఈ మధు ఎవరు? ఈ ఆస్పత్రిలో సంఘటనలకీ, బయట జరిగిన మరో రెండు హత్యలకీ సంబంధమేమిటనేది మిగతా కథ.
ఎలా ఉందంటే?
సరోగసి నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా కథ ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా హరి - హరీష్ దర్శకద్వయం తెరకెక్కించింది. కథ సాగే నేపథ్యం, మనసుల్ని తాకే భావోద్వేగాలు, సమంత నటన సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. గర్భధారణ కోసం ఆస్పత్రిలో చేరడం, ఈవాలో సాగే ఆరంభ సన్నివేశాలతో ప్రేక్షకుడు నేరుగా యశోద ప్రపంచంలోకి వెళతాడు. అక్కడ అనుమానాస్పదంగా అనిపించే విషయాలతో ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ కథని మరింత రక్తి కట్టించడంలో దర్శకులు సఫలమయ్యారు. సరోగసి పేరుతో జరిగే నేరం చుట్టూ సాగే కథ అనే విషయం అర్థమవుతున్నప్పటికీ... ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి మాత్రం కొనసాగుతుంది. మాతృత్వం చుట్టూ సాగే సన్నివేశాలు, అద్దె గర్భం కోసం వచ్చిన కొద్దిమంది యువతుల జీవిత నేపథ్యాలతో భావోద్వేగాలు పండడం ప్రథమార్ధానికి మరింతగా కలిసొచ్చింది.
ద్వితీయార్ధంలోనే అసలు కథ. సాధారణంగా నేర పరిశోధన జరుగుతున్నప్పుడు దొరికే చిన్న చిన్న ఆధారాలతోనే అసలు విషయాలు బయటికొస్తుంటాయి. ఆ తరహా సన్నివేశాలే థ్రిల్‌ని పంచుతుంటాయి. ఈ కథలో మాత్రం నేరాలు చేసేవాళ్లే తమ అసలు రూపాన్ని బయటపెట్టడం అంతగా అతకలేదనిపిస్తుంది. కథలో థ్రిల్ మిస్ కావడానికి అదొక ప్రధాన కారణం. కానీ మధు పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్, డా.గౌతమ్ (ఉన్ని ముకుందన్), కేంద్రమంత్రి (రావు రమేష్) నేపథ్యాలు, వాళ్లు కలిసిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో సమంత పాత్రలో మరో కోణం కనిపిస్తుంది. అది కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. సమంత చేసిన పోరాట ఘట్టాలు బాగున్నాయి. ఈ కథలో భావోద్వేగాలు పండినప్పటికీ, ప్రేక్షకుడికి మరింత థ్రిల్‌ని పంచడంలో దర్శకులు తడబడినట్టు అనిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయి సినిమాకి తగ్గట్టుగా నిర్మించడం సినిమాకి కలిసొచ్చే మరో అంశం.
ఎవరెలా చేశారంటే?
యశోదగా సమంత నటన సినిమాకి ప్రధానబలం. ఆరంభంలో అమాయకంగా కనిపిస్తూ, తనవైన హావభావాలతో వినోదం పంచిన ఆమె, ఆ తర్వాత తనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ పాత్రని పండించిన తీరు బాగుంది. పోరాట ఘట్టాల్లోనూ సత్తా చాటింది. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్‌ల పాత్రలు ఆకట్టుకుంటాయి. మురళీశర్మ, సంపత్‌రాజ్, శత్రు అలవాటైన పాత్రల్లోనే కనిపిస్తారు. సాంకేతిక విభాగాలు సినిమాకి మరింత వన్నె తీసుకొచ్చాయి. మణిశర్మ సంగీతం, అశోక్ కళా ప్రతిభ, సుకుమార్ కెమెరా పనితనం సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఈవా ఆస్పత్రిని తీర్చిదిద్దిన విధానం, దాన్ని తెరపై అంతే కొత్తగా చూపించిన విధానం బాగుంది. సంభాషణలు ఆకట్టుకున్నాయి. దర్శకులు హరి -హరీష్ తెరపై ఓ కొత్త కథని చూపించారు. అయితే ఆ కథని నడిపించిన విధానంలోనే అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయి. మరింత థ్రిల్‌ని జోడించడంలో దర్శకులు విఫలమయ్యారు.
బలాలు
+ కథా నేపథ్యం
+ సమంత నటన
+ భావోద్వేగాలు
+ ప్రథమార్ధం
బలహీనతలు
- ఊహకు తగ్గట్టుగా సాగే సన్నివేశాలు
- కీలక సన్నివేశాల్లో థ్రిల్ కొరవడటం
చివరిగా: యశోద... మెప్పిస్తుంది
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?