సెలైన్‌ పెట్టుకొని సామ్‌ డబ్బింగ్‌ చెప్పింది: ‘యశోద’ నిర్మాత

సమంత ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘యశోద’. హరి-హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈసినిమా నవంబర్‌ 11న విడుదల కానుంది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఉన్నిముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు.

Updated : 06 Nov 2022 20:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయిక సమంత (Samantha) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘యశోద’ (Yashoda). అద్దెగర్భం (సరోగసి) వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..? సరోగసి పేరుతో సమాజంలో జరుగుతోన్న దారుణాలను తెలియజేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. నవంబర్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ విలేకర్లతో ముచ్చటించారు. యశోద ముచ్చట్లతోపాటు సమంత ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు.

సామ్‌ నాకు పెద్దకుమార్తె..!

‘యశోద’ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యనే చూపించనున్నాం. అందుకే, ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేస్తున్నాం. ఈ కథ అనుకున్నప్పటి నుంచి టైటిల్‌ రోల్‌కు సమంతనే అనుకున్నాం. గతేడాదిలో ఆమెకు కథ చెప్పాం. 40 నిమిషాల్లోనే ఆమె ఈ కథ ఓకే చేసింది. సినిమా చేయడానికి అంగీకరించింది. ఆమె నాకొక పెద్ద కుమార్తెలాంటిది. సినిమాకు సంబంధించిన పూర్తి బాధ్యత ఆమే తీసుకుంది.

సెన్సార్‌ వాళ్లు మెచ్చుకున్నారు..!

బాలకృష్ణతో నేను నిర్మించిన ‘ఆదిత్య 369’ కథ విన్నప్పుడు ఎంతలా అయితే ఉత్సాహానికి గురయ్యానో ‘యశోద’ విన్నప్పుడూ అలాగే ఫీలయ్యా. తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. సమంత ఎంతో అద్భుతంగా నటించింది. సినిమా విషయంలో నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మంచి సినిమా తీశాననే సంతృప్తి ఉంది. సెన్సార్‌ వాళ్లు మా సినిమా చూసి మెచ్చుకున్నారు. కాన్సెప్ట్‌ కొత్తగా ఉందని ప్రశంసించారు.

సెలైన్‌ పెట్టుకుని..!

‘యశోద’ డబ్బింగ్‌ సమయంలో తాను అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నానని సమంత ప్రకటించింది. అప్పుడే మాక్కూడా తెలిసింది. తెలుగు, తమిళంలో తన పాత్రకు ఆమే డబ్బింగ్‌ చెప్పింది. తమిళంలో డబ్బింగ్‌ చెబుతోన్న సమయంలో సామ్‌ పూర్తిగా నీరసించిపోయింది. డాక్టర్‌ పర్యవేక్షణలో సెలైన్‌ పెట్టుకొని డబ్బింగ్‌ చెప్పింది. ఇక, హిందీ వెర్షన్‌కు గాయని చిన్మయితో డబ్‌ చెప్పించాం.

బడ్జెట్ పెంచాల్సి వచ్చింది..!

నేను మధ్య తరగతి నిర్మాతను. కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. రూ.3 కోట్లలోనే సినిమా చేయాలని మొదటి నుంచి దర్శకులు అనుకున్నారు. కాకపోతే కథ డిమాండ్‌ చేయడం వల్ల బడ్జెట్‌ పెంచాల్సి వచ్చింది. ‘యశోద’ కోసం నానక్‌రాంగూడలో రెండు భారీ సెట్లు వేసి 55 రోజులు షూట్ చేశాం
. సుమారు 180 మంది మహిళలు ఈసినిమా కోసం పనిచేశారు.

ఆదిత్య 999 మ్యాక్స్..!

బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఆదిత్య 369’కు నిర్మాతగా వ్యవహరించి మంచి విజయాన్ని అందుకున్నాను. నిర్మాతగా ఆ సినిమా నాకొక మైలురాయి. ఇప్పుడదే చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ చేయనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. అందుకు ఆనందంగా ఉంది. అయితే, సీక్వెల్‌కు నేను నిర్మాతగా వ్యవహరించడం లేదు. ఎందుకంటే అంత బడ్జెట్‌ ఇప్పుడు నావద్ద లేదు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని