Ardhashathabdam: రంగులద్దుకున్న సందెపొద్దులాగా..

ప్రేమ పాటల పూదోట తెలుగు చిత్రసీమ. ఏటా తెలుగు తెరపై వందల కొద్దీ ప్రేమ పాటలు పల్లవిస్తుంటాయి. అయితే చక్కటి సాహిత్య సుగంధాలు నింపుకొని..

Updated : 07 Dec 2022 17:38 IST

ప్రేమ పాటల పూదోట తెలుగు చిత్రసీమ. ఏటా తెలుగు తెరపై వందల కొద్దీ ప్రేమ పాటలు పల్లవిస్తుంటాయి. అయితే చక్కటి సాహిత్య సుగంధాలు నింపుకొని.. మైమరపించే బాణీలతో సినీప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. ‘‘ఏ కన్నులు చూడనీ చిత్రమే..’’ అలాంటి ఓ అపురూప గీతమే. ‘అర్ధ శతాబ్దం’ చిత్రం కోసం గీత రచయిత రెహమాన్‌ రాసిన మధురమైన ప్రేమ పాటిది. ఆయన దీని కోసం చేసిన కసరత్తుని ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకున్నారిలా..

ఈ చిత్ర నిర్మాత కిరణ్‌, దర్శకుడు రవీంద్ర పుల్లె నా గత చిత్రాల పాటలు విని.. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. దీంట్లో నేను మొత్తం ఐదు పాటలు రాశాను. అవన్నీ బలమైన సాహిత్యంతో.. కథలో భాగంగా  ఉంటాయి. అయితే వీటిలో ప్రత్యేకమైనది  .. ‘‘ ఏ కన్నులు చూడనీ’’ పాటే. ప్రతి సినిమాలో ప్రేమ గీతాలు వినిపిస్తూనే ఉంటాయి. వీటికి భిన్నంగా ప్రేమని మళ్లీ మనదైన శైలిలో సరికొత్తగా ఆవిష్కరించగలగడం కఠిన పరీక్షే.

ఈ సినిమాలో హీరో చిన్నతనం నుంచే ఓ అమ్మాయిని అమితంగా ఆరాధిస్తుంటాడు. కానీ, ఆ పిల్లకి ఎదురుపడి.. ప్రేమిస్తున్నాని చెప్పే ధైర్యం ఆ కుర్రాడికి లేదు. ఆమె పట్ల తన మనసులో దాగి ఉన్న ప్రేమ భావాల్నే ఓ పాట రూపంలో ఇలా ప్రేక్షకులకి చెబుతుంటాడు ఆ అబ్బాయి. దర్శకుడు దీన్ని చక్కటి మాంటేజ్‌ పాటగా చిత్రీకరించారు. లిరికల్‌ వీడియో చూస్తే ఆ ప్రేమకథ ఏంటన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఈ చిత్ర కథ.. హీరో పాత్ర గ్రామీణ నేపథ్యంలో ఉంటాయి. అందుకే ఒక ఊరి అబ్బాయి తన ప్రేమని, తనకి తెలిసిన భాషలో అందంగా ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో.. ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశా.

ప్రేమని కళ్లతో చూడలేం. కానీ, ప్రేమించిన కుర్రాడు ఆ భావనని తన ప్రాణంతో చూడగలుగుతాడు. అందుకే తొలి పల్లవిలో ‘‘ఏ కన్నులు చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే’’ అని రాశా. హీరో తన చిన్నతనంలో ఓ అనుకోని సంఘటన వల్ల ఆ అమ్మాయిని చూస్తాడు. అదొక మ్యాజికల్‌ మూమెంట్‌. అప్పుడామెపై పుట్టిన ప్రేమ.. తనతో పాటే పెరుగుతూ మనసులో ఓ వనంలా అల్లుకుపోయింది. దీన్నే తొలి చరణంలో  ‘‘ఒకటే క్షణమే చిగురించె ప్రేమనే స్వరం .. ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం’’ అని చెప్పా. తర్వాత లైన్లలో    ‘‘అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే.. గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే.. అందమైన ఊహలెన్నో ఊసులాడెలే’’ అంటూ ఆ కుర్రాడి ప్రేమని మట్టి వాసనున్న పదాలతో మిళితం చేసి అందంగా  ఆవిష్కరించా. రెండో చరణంలో ‘‘ఎంత దాచుకున్నా పొంగిపోతు ఉన్నా.. కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన’’ అని రాశా.

‘‘దారి కాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా.. నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా’’ అని ఓ లైన్‌ రాశా. చిత్ర కథతో ముడిపడి ఉన్న ఎంతో ప్రాధాన్యమున్న  వాక్యమిది. ఆ అబ్బాయికి తన ప్రేయసిపై ఎంత ప్రేమ ఉన్నా.. ఎదురుపడి చెప్పే ధైర్యం లేదు. అందుకే ప్రతిరోజూ దారి కాచి ఆమెనే చూస్తూ ఉన్నా.. తిరిగి చూస్తే భయపడి దాగుండి పోతుంటాడు. మూడో చరణంలో ‘‘ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా.. నవ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా’’ అని ఉంటుంది. సాధారణంగా సూర్యాస్తమయ సమయంలో ఆకాశం రకరకాల వర్ణాల్లో కనిపిస్తుంటుంది. వాటిలో చాలా రంగుల్ని మనం వర్ణించలేం. అన్ని వర్ణాలు తన ప్రేయసి నవ్వులో ఆ కుర్రాడికి కనిపిస్తుంటాయి. అందుకే  ‘నీ నవ్వులు పంచే వెలుగులు చాలు.. ప్రత్యేకంగా దివ్వెలెందుకు’ అని ఆమెపై ప్రేమని కురిపిస్తుంటాడు.

ఈ పాట రాస్తున్నప్పుడు సిద్‌ శ్రీరామ్‌తో పాడిస్తారని తెలియదు. దీంట్లోని సాహిత్యం చూశాక.. ఇది ఆయనతో పాడిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచించారు. నేనీ గీతాన్ని వారం రోజుల్లో పూర్తి చేశా. తర్వాత పాట ట్యూన్‌ చేసే సమయంలో.. చరణాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశా అంతే. ఓ మంచి సాహిత్యానికి చక్కటి బాణీ, గ్రాత్రం తోడైతే ఎలా ఉంటుందో ఈ పాటతో  మరోసారి నిరూపితమైంది. ఒక గీతం ఓ చిన్న సినిమాకి ఇంతటి ఆదరణ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే దీంట్లో ఎక్కువ క్రెడిట్‌ సిద్‌ శ్రీరామ్‌ గాత్రానికే ఇవ్వాలి. ఆయన పాడటం వల్లే ఈ పాట మరింత ఎక్కువ మందికి చేరువైంది.

చిత్రం: అర్ధ శతాబ్దం
సంగీతం: నవ్‌ఫాల్‌ రాజా ఎఐఎస్‌
గానం: సిద్‌ శ్రీరామ్‌
సాహిత్యం: రెహమాన్‌
దర్శకుడు: రవీంద్ర పుల్లె
పల్లవి:
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే //ఏ కన్నులు//
చరణం 1:
ఒకటే క్షణమే చిగురించె ప్రేమనే స్వరం
ఎదలో మనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే //ఏ కన్నులు//
చరణం 2:
ఎంత దాచుకున్నా పొంగిపోతు ఉన్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారి కాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా
నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా
నిను తలచీ ప్రతి నిమిషం పరవశమై
పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా //అందుకే ఈ నేల నవ్వి// //ఏ కన్నులు//
చరణం 3:
ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ల నిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే మనసుకిదీ మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా
వెలుగై ఉన్నా //అందుకే ఈ నేల
నవ్వి// //ఏ కన్నులు//
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని