హాంకాంగ్‌లో వేడుకగా సత్యనారాయణస్వామి వ్రతం, కార్తిక వనభోజనాలు

పవిత్ర కార్తిక మాసం సందర్భంగా హాంకాంగ్‌లోని తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి వత్రం, కార్తిక వనభోజనాలు వేడుకగా సాగాయి.

Updated : 29 Nov 2021 00:20 IST

హాంగ్‌ కాంగ్‌: పవిత్ర కార్తిక మాసం సందర్భంగా హాంకాంగ్‌లోని తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి వత్రం, కార్తిక వనభోజనాలు వేడుకగా సాగాయి. తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ఆధ్వర్యంలో ఏటా హాంకాంగ్‌కు వచ్చే నూతన తెలుగు జంటలతో ఇక్కడ సత్యనారాయణస్వామి వ్రతం, వనభోజనాలు నిర్వహిస్తున్నారు. పత్రి భీమసేన తెలుగు జంటలతో సత్యనారాయణస్వామి వ్రతం చేపించారు. ఈ సందర్భంగా భీమసేన మాట్లాడుతూ.. దేశం కానీ దేశంలో తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. మన సంస్కృతి సంస్కారాలను విడిచిపెట్టకుండా సంకల్పంతో ఈ వ్రతం చేసిన నూతన జంటలకు అభినందనలు తెలిపారు. హిందూ దేవాలయ సిబ్బంది సహకారంతో నిర్వాహకులు సత్యనారాయణస్వామి వ్రతం పూజా మంటపాన్ని అందంగా అలంకరించారు. 

ఈ సందర్భంగా తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి మాట్లాడుతూ.. సత్యనారాయణస్వామి వ్రతంతో పాటు, వనభోజనాల కార్యక్రమం ఏటా కొనసాగాలని ఆకాంక్షించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ కార్యక్రమాలు జరగలేదని, మళ్లీ ఇప్పుడు సభ్యులందరూ కలిసి సత్యనారాయణవ్రతంతో పాటు కార్తిక వనభోజనాలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నట్లు తెలిపారు. వన భోజనాల్లో భాగంగా ఓ చిన్నారి పుట్టినరోజుతో పాటు, రెండు జంటలు తమ పెళ్లి రోజుని సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలుగువారితో కలిసి ఆనందంగా కార్తిక వనభోజనాల కార్యక్రమం నిర్వహించుకుకోవడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని పలువురు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని