Updated : 24/10/2020 21:52 IST

కరోనా ధాటికి అమెరికా విలవిల!

ఒక్కరోజే రికార్డుస్థాయిలో 83వేల కేసులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఇప్పటి వరకు ఎన్నడూలేని విధంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 83 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. జులై నెల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటికే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 85 లక్షలకు చేరుకోగా.. వీరిలో 2 లక్షల 24వేల మంది మృత్యవాతపడ్డారు. ఇక జులై 16వ తేదీన అత్యధికంగా ఒక్కరోజే 77,632 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల తర్వాత తాజాగా ఒకరోజు వ్యవధిలోనే రికార్డుస్థాయిలో 83,757 కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కనెక్టికట్‌ రాష్ట్రంతోపాటు సమీప ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది.

నిండిపోతున్న ఆసుపత్రులు..హెచ్చరిస్తున్న గవర్నర్లు..

అధిక జనసాంద్రత, జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో కరోనా వైరస్‌ కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, అమెరికాలో మాత్రం ఇలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. పలుచోట్ల లాక్‌డౌన్‌ విధిస్తుండడంతోపాటు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల ఆసుపత్రులు నిండిపోవడంతో సియాటెల్‌, పోర్ట్‌లాండ్‌, ఒరేగన్‌ ప్రాంతాలకు రోగులను ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా తరలిస్తున్నారు. మరికొన్ని ఆసుపత్రుల్లో చిన్నారులను మినహా ఎవ్వర్నీ చేర్చుకునే పరిస్థితులు లేవని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ‘కరోనా వైరస్‌ బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే మాస్కు ధరించకుండా తిరుగుతారో వారికి టీకా వేయం’ అని ఉతాహ్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్యారీ హెర్బర్ట్‌ ప్రకటించారు. ఇలాంటి నిర్ణయం మంచిది కానప్పటికీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదుకావడంతోనే ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే.. రాష్ట్రంలో ఆరోగ్యవ్యవస్థ పూర్తిగా చేతులెత్తేయాల్సిన ప్రమాదం ఉందని ఆయన  హెచ్చరించారు. అయినప్పటికీ చాలాప్రాంతాల్లో అధికారుల సూచనలను ప్రజలను పట్టించుకోవడం లేదని.. దీంతో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి రావడంలేదని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు.

వారంలో భారీగా పెరిగిన తీవ్రత..

ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి చూస్తుంటే యూరప్‌లో విజృంభించిన మాదిరిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ డకోటా, ఉతాహ్‌, ఇదాహో రాష్ట్రాలు వైరస్‌ ధాటికి వణికిపోతున్నాయి. అమెరికాలో గత కొద్దిరోజులుగా వారంలో సరాసరి కేసుల సంఖ్య 44 వేలు ఉండగా ప్రస్తుతం అది 61వేలకు పెరగడం అక్కడ పరిస్థితి అద్దం పడుతోంది. అయితే, వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలుచోట్ల ప్రజల నుంచి మద్దతు కరువవుతోంది. మాస్కులు, భౌతికదూరం, లాక్‌డౌన్‌ ఆంక్షలపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికలు కూడా వైరస్‌ తీవ్రతపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండానే ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు దర్శనమిస్తున్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని