
అమెరికా చదువులపై తగ్గిన మోజు!
తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో అనాసక్తి
ట్రంప్ వలస విధానాలే కారణం
చికాగో: ఉన్నత చదువులకు అమెరికా స్వర్గధామమని చాలా మంది భావిస్తారు. తమ పిల్లలు అమెరికాలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకుంటారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల ఎన్నో విద్యాసంస్థలు ఆ దేశంలో ఉన్నాయి. అందుకే భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశ వాసులకు అగ్రరాజ్య చదువులంటే మోజు. కానీ ఆ పరిస్థితి మారిందంటున్నారు విశ్లేషకులు . అమెరికా చదువులంటేనే చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ 2016 నుంచి అంతకుముందు ఏ అమెరికా దేశాధ్యక్షుడు చేయనన్ని మార్పులు వలస విధానంలో చేశారు. ఫలితం.. అమెరికా చదువంటేనే గుబులు పట్టుకుంది చాలా మందికి. ఏదైనా కళాశాలలో చేరినా.. చదువు చివరివరకు సాగుతుందా లేదా అన్న భయాలు నెలకొన్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చేవారి సంఖ్య రాన్రాను తగ్గుతోంది.
* స్వదేశాల బయట ప్రపంచవ్యాప్తంగా 5.3 మిలియన్ విద్యార్థులు చదువుతున్నారు. 2001తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపైంది. అమెరికా వాటా మాత్రం తగ్గుతూనే వస్తోంది. 2001లో 28శాతం ఉన్న వాటా గత ఏడాదికి 21 శాతం పడిపోయింది. అంతేకాదు. అమెరికాకు వస్తున్న విద్యార్థుల సంఖ్య గత కొన్ని సంవత్సరాల్లో పడిపోయింది. 2016లో 3 శాతం తగ్గితే. మరుసటి సంవత్సరం 7 శాతం తగ్గింది.
* ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న ఇటీవల ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధన విద్యార్థుల్లో అలజడి రేపింది. అయోమయాన్ని రేపింది. కోర్టుల జోక్యంతో వెనక్కి తగ్గినా.. ఇటీవల విదేశీ విద్యార్థుల రాకను మరింత నియంత్రిండానికి ఒక ముసాయిదాను ట్రంప్ ప్రభుత్వం రూపొందించింది. అందులో ఫిక్స్డ్ స్టూడెంట్స్ నిబంధనలను విధించనుంది. వీసాలు నాలుగేళ్లకే పరిమతం చేయనుంది. ఇరాన్, సిరియా నుంచి వచ్చిన వాళ్లకు రెండేళ్ల వరకే అనుమతి ఉంటుంది.
* ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్కిటెక్చర్ కోర్సులకు పేరొందిన చికాగో యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్య 2016 నుంచి 2018కు మధ్య 25 శాతం పడిపోయింది.
* వీసా మోసాలను నిరోధించడానికి నిబంధనలు తెస్తున్నామని అధికారులు అంటున్నారు. ఆ పేరుతో అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల రాకను నియంత్రిస్తున్నారని అమెరికా కళాశాలల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
బైడెన్ వస్తే మారుతుందా..
డొనాల్డ్ ట్రంప్ కాలంలో వలస విధానం అనేక మార్పులకు గురైంది. విదేశీ విద్యార్థులే కాదు.. ఉద్యోగ నిపుణులూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ట్రంప్ విధించిన వలస ఆంక్షల్లో కొన్నింటిని రద్దు చేస్తామని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చెబుతున్నారు. హెచ్1 బీ విసాల సంఖ్యను పెంచుతామంటున్నారు. విదేశీ విద్యార్థులకు.. అమెరికాలో చదువుకునేందుకు.. తర్వాత ఆ దేశ పౌరసత్వం తీసుకునేందుకు మార్గం సుగమం చేస్తామంటున్నారు.