
బ్రిటన్ ఆర్థిక మంత్రి ఇంట్లో దీపావళి!
లండన్: దీపావళి వేడుకలు బ్రిటన్‌లో ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ తన నివాసంలో స్వయంగా మట్టి దీపాలను వెలిగించారు. కాగా, ప్రధానితో సహా బ్రిటన్‌లోని అతిరథ మహారథుల కార్యాలయాలు, నివాసాలు ఉండే 11 డౌనింగ్ స్ట్రీట్‌లో దీపాలు వెలిగించటం బ్రిటన్ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా, ఇది తమకు గర్వకారణమని అక్కడి భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి తరువాతి స్థానమని భావించే ఆర్థిక మంత్రి పదవి ఈ సారి 39ఏళ్ల రిషి సునక్‌ను వరించింది. ఈ స్థాయిలో ఉన్నా సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ భారతీయమే అని చాటారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశంలో తొలిసారిగా ‘‘ఐ గ్లోబల్ దివాలీ ఫెస్ట్ 2020’’ ఆన్లైన్ దీపావళి వేడుకల కార్యక్రమాన్ని ఇటీవల ఆవిష్కరించారు. దీనిలో బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతీ పటేల్, ప్రతిపక్ష నేత కీర్ స్టార్మర్, లిబరల్ డెమొక్రాట్ పార్టీ నేత ఎడ్ డేవీ తదితరులు పాల్గొంటారు. అంతేకాకుండా బ్రిటన్‌లో భారతీయులు వివిధ రంగాల్లో అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ.. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అవివేకంపై జ్ఞానం విజయం సాధిస్తుందని చెప్పే దీపావళి ఆదర్శంగా కొవిడ్-19 వైరస్‌పై గెలవగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా దీపావళి ఆనందాన్ని పంచుకునేందుకు బంధువులు, మిత్రుల ఇళ్లకు వెళతామని.. ఇక వారితో సమోసా, గులాబ్ జాంలు తదితరాలను పంచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. అటువంటి పండుగను దూరదూరంగా ఉండి జరుపుకోవటం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరిన్ని సవాళ్లు ముందున్నాయని.. వివేకవంతులైన తమ ప్రజల సహకారంతో వాటిని ఎదుర్కొంటామని పూర్తి నమ్మకమున్నట్టు ఆయన ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.