
ఎయిర్ ఇండియా విమానాలపై హాంగ్‌కాంగ్ నిషేధం
దిల్లీ: భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాలపై హాంగ్‌కాంగ్ మరోసారి నిషేధాన్ని విధించింది. తాజా నిషేధం నవంబర్ 10 వరకు అమలులో ఉంటుంది. కాగా, హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలను నిషేధించటం ఇది నాలుగవసారి. భారత్ నుంచి ఆ దేశానికి చేరుకున్న కొందరు ప్రయాణికులకు కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ కావటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు హాంగ్‌కాంగ్ ప్రకటించింది.
భారత్ నుంచి హాంగ్‌కాంగ్ వచ్చే ప్రయాణికుల్లో ప్రయాణానికి 72 గంటల ముందుగా కొవిడ్ నెగిటివ్ అనే ధృవపత్రం సమర్పించిన వారిని మాత్రమే అనుమతిస్తామని ఆ ప్రభుత్వం జులైలో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తమ ప్రయాణికులెవరికీ కరోనా సోకలేదని విమానయాన సంస్థలు కూడా ఓ ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణికులందరికీ హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలో కొవిడ్ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. అయితే ఈ వారం ముంబయి నుంచి హాంగ్‌కాంగ్‌కు ప్రయాణించిన కొందరికి.. అక్కడికి చేరిన అనంతరం కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు హాంగ్‌కాంగ్ ఉన్నతాధికారులు తెలిపారు. దీనితో ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను ఆ దేశం నాలుగోసారి నిలిపివేసింది.