
ట్రంప్ ఉంటే, క్షేమమే..
అమెరికా అధ్యక్షుడి కోసం ప్రవాస భారతీయుడి ఉద్యమం
వాషింగ్టన్: రిపబ్టికన్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త, ట్రంప్‌కు వీరాభిమాని డానీ గైక్వాడ్.. ‘ట్రంప్ హై తో సేఫ్ హై’ (ట్రంప్ ఉంటే క్షేమమే) అనే పేరుతో ఓఉద్యమాన్ని ప్రారంభించారు. అధ్యక్షుడు భారత్‌కు చేసిన మేలును గురించి వివరించటమే తమ ఉద్యమం ముఖ్య ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇటీవల తాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లను వ్యక్తిగతంగా కలిసినట్టు తెలిపారు. అయితే ఈసారి అధ్యక్ష ఎన్నికల రేసులో ట్రంప్ గాయపడ్డారని.. అందుకే ఆయనకు మద్దతు తెలిపేందుకు తన సొంత డబ్బును ఉపయోగిస్తున్నానని ఫ్లోరిడాకు చెందిన గైక్వాడ్ వివరించారు. ‘‘అమెరికాను నడిపించేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ట్రంపే తగిన వ్యక్తి అని నేను భావిస్తున్నాను. హోరాహోరీ పోరు సాగే పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, మిచిగన్, ఓహియో వంటి రాష్ట్రాల్లో గెలుపునకు భారతీయ అమెరికన్ ఓట్లు కీలకం కానున్నాయి.’’ అని గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన డానీ అభిప్రాయపడ్డారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరున ఉన్న ‘‘మోదీ హై తో ముమ్కిన్ హై’’ (మోదీ ఉంటే సాధ్యమే) అనే నినాదం ఆదర్శంగా తాను తన ఉద్యమం పేరును ఎంచుకున్నానన్నారు. ట్రంప్‌ను ఎందుకు ఎన్నుకోవాలనే ప్రశ్నకు సమాధానం చాలా సులభమని.. ఆయన భారతీయులకు మిత్రుడని, ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారన్నారు.