
నాకు పేదరికం తెలుసు..అందుకే ఆకలి తీరుస్తున్నా
మెల్బోర్న్: ‘నేను పేదరికాన్ని చూశాను.. ఉండటానికి ఇల్లు లేకుండా బతికాను..అందుకే నాకు ఆకలి విలువ తెలుసు. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని అప్పుడే అనుకున్నాను’ అని అంటున్నారు ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు దామన్ శ్రీవాస్తవ్. వృత్తిపరంగా చెఫ్ అయిన ఆయన ప్రవృత్తి మాత్రం ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే. ఈ కరోనా కాలంలో నిలువ నీడలేని, అవసరంలో ఉన్నవారికి పట్టెడన్నం పెడుతున్నారు. బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ విదేశాలబాట పట్టిన విద్యార్థులకు చేయూతనిస్తున్నారు ఈ 54 ఏళ్ల దామన్.
మెల్బోర్న్లో నివసించే దామన్ శ్రీవాస్తవ్ స్వస్థలం దిల్లీ. ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియా వెళ్లి, స్థిరపడిన ఆయన అంతకు ముందు కొంతకాలం ఇతర దేశాల్లోనూ పనిచేశారు. ఇలా చేతనైన సాయం చేయడం తనకు కొత్తేమీ కాదని, గతంలో ఇరాక్‌లో గల్ఫ్ యుద్ధం సమయంలోను అక్కడి ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టినట్లు తెలిపారు. ‘ఈ కరోనా మహమ్మారికి, గల్ఫ్ యుద్ధానికి పోలిక లేదు. కానీ, ఇంట్లోనే చిక్కుకుపోయి, బయట కాలుపెట్టాలంటే బయపడే పరిస్థితే రెండు సందర్భాల్లోను ఉంది. ప్రజలు ఉపాధి కోల్పోయారు. వారి జీవితం తలకిందులైంది’ అంటూ దామన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన తొలినాళ్లలో తాను కూడా పేదరికాన్ని చవిచూశానని, ఆకలి విలువ తనకు తెలుసని చెప్పుకొచ్చారాయన. ‘ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నేను పేదరికాన్ని అనుభవించాను. నాకు కొద్ది రోజులు ఉండటానికి ఇల్లు లేదు. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవం..అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచనను కలిగించింది. గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా నేను కొన్ని వందల మందికి బాగ్దాద్‌లో ఉచితంగా భోజనం అందించాను. ఈ క్లిష్ట సమయంలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని నా వంటింట్లోనే ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాను. నా కారులోనే నగరమంతా తిరిగి భోజనం అందిస్తున్నాను. దీనికి నా భార్య, కుమార్తె కూడా సహకరిస్తున్నారు. మీడియా ద్వారా ఈ విషయం పదిమందికి తెలియడంతో ఇప్పుడు చుట్టుపక్కల వారి సహకారం అందుతోంది. అలాగే మాతో పనిచేస్తామని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. అంతేకాకుండా స్థానిక నేతలు మాకు కొంత స్థలం ఇచ్చి, కమ్యూనిటీ వంటశాలను ఏర్పాటు చేశారు’ అని తన ప్రయత్నంలో భాగమైన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఫేస్బుక్ పేజ్ ద్వారా విరాళాలు సేకరిస్తున్న ఆయన.. ఈ వైరస్ అంతమైన తరవాత కూడా తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.