Published : 09/11/2020 12:39 IST

నలుదిశలా మన నాయకులు

పలు దేశాల్లో కీలక స్థానాల్లో భారతీయులు  

తాజాగా అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో రెండో అత్యున్నత స్థానానికి ఎన్నికైన తొలి మహిళగా, భారత సంతతి వ్యక్తిగా కమలా హారిస్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆ మాటకొస్తే ఒక్క అమెరికానే కాదు.. యూకే, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్‌.. ఇలా పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులు నాయకత్వ స్థానాలకు ఎదిగి తమదైన ముద్ర వేస్తున్నారు. వీళ్లు మన జాతికి, సంస్కృతికి ప్రతీకలుగా ఉండటంతో పాటు.. భారతదేశ పేరు ప్రఖ్యాతులను నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు.

నిక్కీ హేలీ 
గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించిన నిక్కీ హేలీ (48) 2024లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి కూడా పోటీ పడే అవకాశం ఉంది. అమెరికా యంత్రాంగంలో కేబినెట్‌ స్థాయి పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి ఆమే. దక్షిణ కరొలినాకు తొలి మహిళా గవర్నర్‌గాను, అమెరికాలో అత్యంత పిన్న వయస్కురాలైన గవర్నర్‌గా ఉండటంతో పాటు.. ఆ పదవికి ఎన్నికైన భారత సంతతి వారిలో రెండో వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.

ప్రియాంకా రాధాకృష్ణన్‌ 
న్యూజిలాండ్‌ పార్లమెంటులో మలయాళంలో మాట్లాడి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన మహిళా నేత.. ప్రియాంకా రాధాకృష్ణన్‌ (41). భారతదేశంలోనే పుట్టిన ప్రియాంక సింగపూర్‌లో చదువుకుని, న్యూజిలాండ్‌ వెళ్లారు. గృహహింస బాధితులైన మహిళలు, దోపిడీకి గురయ్యే వలస కార్మికుల తరఫున వాదించేవారు. 2017, 2019 సంవత్సరాల్లో లేబర్‌ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జాతులు, సమూహాల సంక్షేమ శాఖ మంత్రికి పార్లమెంటరీ ప్రైవేటు కార్యదర్శిగా నియమితులయ్యారు.

హర్‌జీత్‌ సజ్జన్‌
కెనడా పార్లమెంటుకు సజ్జన్‌ (50) తొలిసారి 2015లో దక్షిణ వాంకూవర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి కెనడాకు వలస వెళ్లారు. వాంకూవర్‌ పోలీసు విభాగంలో డిటెక్టివ్‌గాను, బ్రిటిష్‌ కొలంబియా రెజిమెంటులో లెఫ్టినెంట్‌ కర్నల్‌గాను పనిచేశారు. ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రిగా ఉన్న సజ్జన్‌.. 11 ఏళ్ల పాటు వాంకూవర్‌ పోలీసు శాఖలో పనిచేశారు. 

రిషి సునక్‌
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిషి సునక్‌ (40)ను అక్కడి ఖజానా ఛాన్స్‌లర్‌గా నియమించారు. అంతకుముందు ఖజానా ప్రధాన కార్యదర్శిగాను, గృహనిర్మాణ, స్థానిక సంస్థల సహాయ మంత్రికి పార్లమెంటరీ అండర్‌ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి అల్లుడైన రిషి 2015 మేలో కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2017 జూన్‌ నుంచి మంత్రి అయ్యేవరకు వాణిజ్య, ఇంధన, పారిశ్రామిక వ్యూహాలకు సంబంధించి పార్లమెంటరీ ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు.

ప్రీతి పటేల్‌
బ్రిటన్‌లో మంత్రిగా పనిచేసిన మొదటి భారత సంతతి మహిళ ప్రీతి పటేల్‌ (48). 2013 నవంబరులో నాటి ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ఆమెను తొలిసారి మంత్రిగా నియమించారు. తర్వాత 2014లో ఖజానా శాఖ మంత్రిగా, 2015లో ఉపాధికల్పన శాఖ సహాయమంత్రిగా, 2016లో అంతర్జాతీయ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఆమె.. 2019లో హోంశాఖ సహాయమంత్రి అయ్యారు.

లియో వరాద్కర్‌ 
ఐర్లండ్‌ దేశానికి అత్యంత చిన్న వయసులో ఎన్నికైన మొట్టమొదటి స్వలింగ (గే) ప్రధానమంత్రిగా లియో వరాద్కర్‌ 2017లో చరిత్ర సృష్టించారు. ముంబయికి చెందిన అశోక్‌ వరాద్కర్, ఐర్లండ్‌కు చెందిన మిరియంలకు డబ్లిన్‌లో పుట్టిన లియో.. గతంలో ఐర్లండ్‌ సంక్షేమశాఖ మంత్రిగా చేశారు. 24 ఏళ్ల వయసులో కౌన్సిలర్‌గా తొలిసారి ఎన్నికైన ఆయన వృత్తిరీత్యా వైద]్యుడు. ఐర్లండ్‌ కొత్త ప్రధాని మైకేల్‌ మార్టిన్‌కు అవకాశం ఇవ్వడం కోసం ఈ ఏడాది జూన్‌లో ఆయన తప్పుకొన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఆయనే ప్రధాని అవుతారు.

ప్రీతమ్‌ సింగ్‌
సింగపూర్‌ పార్లమెంటుకు 2020 జులైలో జరిగిన ఎన్నికలలో మొత్తం 93 స్థానాల్లో పోటీ చేసిన వర్కర్స్‌ పార్టీ 10 చోట్ల గెలిచింది. ఈ పార్టీకి అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రీతమ్‌ సింగ్‌. సింగపూర్‌ పార్లమెంటరీ చరిత్రలోనే అతిపెద్ద ప్రతిపక్షంగా వర్కర్స్‌ పార్టీ నిలిచింది. ఆ దేశంలో ప్రతిపక్షంగా తొలిసారి అధికారికంగా గుర్తింపు పొందినదీ ఈ పార్టీనే.  

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని