
కెనడా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థుల విజయం
ఒట్టావా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది భారత సంతతి వ్యక్తులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) తిరిగి అధికారం లోకి వచ్చింది. కాగా, ఈ పార్టీకి సిక్కు మతస్తుడైన జగ్మీత్సింగ్ సారధ్యం వహిస్తుండటం విశేషం. తాజా ఎన్నికల్లో 87 మంది సభ్యులు గల శాసనసభలో ఎన్డీపీకి 55 సీట్లు దక్కడం గమనార్హం.
శనివారం వెల్లడైన ప్రాధమిక ఫలితాల్లో.. రిచ్మండ్-క్వీన్స్బర్గ్ ప్రాంతం నుంచి అమన్ సింగ్ గెలుపొందగా.. ఉప సభాపతి రాజ్ చౌహాన్ బర్నాబే ఎడ్మండ్స్ నుంచి, కార్మిక మంత్రి హ్యారీ బైన్స్ - సర్రే న్యూటన్ నుంచి, జగ్రూప్ బ్రార్ -సర్రే ఫ్లీట్వుడ్, రవి కహ్లోన్ -డెల్టా నార్త్ నియోజక వర్గాల నుంచి విజయం సాధించారు. ఇక ఎన్డీపీ పార్టీ తరపున విజయం సాధించిన భారత సంతతి మహిళలుగా మాజీ మంత్రి జిన్నీ సిమ్స్, నికీ శర్మ, రచనా సింగ్ నిలిచారు.
కాగా, ఐదు లక్షల పోస్టల్ వోట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. తాము తుది కౌంటింగ్ కోసం వేచిచూస్తున్నామని.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటం, ప్రజలకు అవసరమైన సేవలు, సదుపాయాల కల్పన తదితర కీలక అంశాలపై దృష్టి సారిస్తామని విజేతలు హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.