అభ్యర్థి గుణగణాలు చూసి ఓట్లేస్తే మంచి జరుగుతుంది
స్టోక్ ఆన్ ట్రెంట్ సిటీకి డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక
ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకుని విదేశాల్లో విజయం సాధిస్తున్న భారతీయులు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు విద్య, వైద్యం, వ్యాపారాల్లో ఎక్కువగా రాణించే ప్రవాసులు.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. లియో వర్దాకర్, కమలా హారిస్, అనితా ఆనంద్ ఇలా ఎంతో మంది భారతీయ మూలాలున్నవారు అక్కడ సత్తా చాటుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ రాజకీయాల్లో తెలుగుతేజం చంద్ర కన్నెగంటి మెరిశారు. ఇంగ్లాండ్‌లోని ‘స్టోక్ ఆన్ ట్రెంట్’ సిటీకి డిప్యూటీ లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అక్కడ రాజకీయాల్లో రాణించాలంటే డబ్బుతో పనిలేదని చెప్తున్నారు చంద్ర కన్నెగంటి. అదెలానో ఆయన మాటల్లోనే విందాం.
ఓ తెలుగు వ్యక్తి ఈ హోదా దక్కించుకోవడం ఇదే మొదటి సారి. డాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఈ స్థాయికి ఎలా చేరగలిగారు?
మా అన్నయ్య, నేను, నాన్న ఎక్కువగా రాజకీయాల గురించి మాట్లాడుకునే వాళ్లం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమావేశాల్లో పాల్గొనేవాడిని. ఇక్కడికి(ఇంగ్లాండ్) వచ్చిన తర్వాత అనుమతి పొంది వైద్యుడిగా జనరల్ ప్రాక్టీస్ చేశాను. అనంతరం లీడర్షిప్ శిక్షణ తీసుకుని వార్విక్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పొందాను. రాజకీయాల వైపు ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలో చేరాను.
విదేశాల్లో ఇంత గుర్తింపు రావాలంటే కచ్చితంగా విద్యతో పాటు ఇతర రంగాల్లో ప్రావీణ్యం ఉండి ఉండాలి. మీ విద్య తదితరాలు ఎక్కడ, ఎలా సాగాయి?
నా పాఠశాల విద్య అంతా హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్ అనే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో జరిగింది. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత అక్కడి నుంచి యూకేకి వచ్చాను. ఇక్కడ మెడికల్ ట్రైనింగ్ ఉన్నత విలువలతో కూడి ఉంటుంది. దీని ద్వారా వార్విక్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయగలిగాను. తర్వాత డొనాల్డ్ కాలేజీలో జీపీ నుంచి ఫెలోషిప్ అందుకున్నాను. 16 ఏళ్ల నుంచి నేను జనరల్ ప్రాక్ర్టీషనర్గా పని చేస్తున్నాను.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ యూకేలో చాలా బలమైంది. మీరు ఈ పార్టీలో ఎప్పుడు, ఎలా చేరారు?
నేను 2002లో యూకేకి వచ్చాను. ఇక్కడ స్థిరపడిన తర్వాత 2009వ సంవత్సరంలో పార్టీలో చేరాను. అప్పుడు పార్టీ అధికారంలో లేదు. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో లేదో తెలీదు. పార్టీ విధానాలు, విలువలు నాకు బాగా నచ్చటంతో చేరాను. నేను ఈ దేశానికి 1000 పౌండ్లతో వచ్చాను. ఆ తర్వాత వ్యాపారాలు చేయటం, మూడు క్లినిక్‌లు ప్రారంభించాను. ఇక్కడ ఇలాంటి అనుకూల పరిస్థితులు చాలా ఉన్నాయి.
రాజకీయాల్లోకి రావటానికి ఒక్కొక్కరికి ఒక్కో ఉద్దేశం ఉంటుంది. ఏ విధానాలు, ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు?
నేను వైద్యుడిగా సేవలందించే సమయంలో నా దగ్గరికి వచ్చిన రోగుల మాటల్లో చాలా విషయాలు అర్థమయ్యేవి. వారి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలిసేవి. ప్రజలకు సాయం చేయాలని నేనే వైద్య వృత్తిని ఎంచుకున్నాను. అలాగే ఓ వైద్యుడు రాజకీయ నాయకుడైతే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని ఈ మార్గంలో నడుస్తున్నాను.
మీరు డిప్యూటీ లార్డ్ మేయర్‌గా ఎన్నిక కావడానికి జనరల్ ప్రాక్ర్టీషనర్గా ఉన్న మీ పేరు, విశ్వసనీయత తోడ్పాడ్డాయనుకుంటారా?
కచ్చితంగా తోడ్పడ్డాయి. నేను కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేస్తానంటే నా సహ వైద్యులు వద్దన్నారు. వందేళ్లలో ఈ పార్టీకి కనీసం 20 శాతం ఓట్లు కూడా రాలేదని చెప్పారు. నేను సేవ చేసిన ప్రాంతం, ప్రజల గురించి నాకు తెలుసని ముందుకు వెళ్లాను. ఇక్కడి ప్రజలపై ఉన్న నమ్మకమే నన్ను గెలిపించగలిగింది. ఈ పార్టీలో నేను కౌన్సెలర్‌గా ఉన్న సమయంలో చాలా పదవులు అలంకరించడానికి పార్టీ అవకాశాలు కల్పించింది. కానీ లార్డ్ మేయర్ అయితే ఇక్కడ ప్రజలకు మంచి వ్యాపార, ఆర్థిక అవకాశాలు కల్పించవచ్చని పార్టీకి చెప్పాను. తనకు డిప్యూటీ లార్డ్మేయర్గా నామినేషన్ ఇవ్వమని కోరాను. వారు అలాగే అవకాశం ఇచ్చారు. డిప్యూటీ లార్డ్ మేయర్ సంవత్సరం తర్వాత లార్డ్ మేయర్ అవుతారు.
జనరల్ ప్రాక్ర్టీషనర్, డిప్యూటీ లార్డ్ మేయర్ రెండూ విభిన్న వృత్తులు.. విభిన్న హోదాలు.. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని మీరు ఎలా సమన్వయం చేయగలిగారు?
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ రెండు వృత్తులను ఎంచుకున్నాను. సేవాగుణమే నన్ను ముందుకు నడిపిస్తోంది.
ఏదైనా రాజకీయ పార్టీలో అవకాశం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్న బలగం.. డబ్బు ఖర్చు పెట్టే సామర్థ్యం.. ప్రజలపై అతనికి ఉన్న నమ్మకం ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. మీకు కన్జర్వేటివ్ పార్టీలో అవకాశం ఎలా లభించింది?
ఇక్కడ రాజకీయ పార్టీల్లో చేరటానికి కండ బలం, డబ్బు అవసరం లేదు. సాధారణ వ్యక్తి కూడా చేరొచ్చు. తొలుత పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాలంటరీగా పాల్గొని ప్రజలకు సేవ చేయాలి. తర్వాత మనకు పార్టీలో ఏ పదవి కావాలో తెలుపుతూ పార్టీ అధిష్ఠానానికి దరఖాస్తు పెట్టుకోవాలి. దాన్ని పార్లమెంటరీ అంచనా బోర్డు దరఖాస్తుదారుడి గురించి వివరాలు సేకరిస్తుంది. ఇలాంటి బోర్డులే మన దేశంలోనూ ఏర్పాటైతే చక్కటి రాజకీయ నాయకులు, నిజమైన సేవా గుణమున్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది.
డిప్యూటీ లార్డ్ మేయర్‌గా పార్టీ చాలా రోజుల కిందటే మీ పేరును ఖరారు చేసింది. కానీ లార్డ్ మేయర్‌గా సుమారు రెండు నెలల కిందటి వరకూ ఓ అభ్యర్థకి మద్దతు ఇచ్చింది. ఓటింగ్‌కు మూడు నాలుగు రోజుల ముందు మరో వ్యక్తి రాస్ ఇర్విన్ పేరు ప్రకటించడానికి గల కారణాలు?
ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గుర్తుకొస్తాయి. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ, సిటీ ఇండిపెండెంట్ గ్రూప్ అనేవి రెండూ కలిసి ఉండేవి. మా పార్టీలో 15 మంది కౌన్సెలర్లు, సిటీ ఇండిపెండెంట్ గ్రూపులో 12 మంది ఉండేవాళ్లు. కలిసి ఉన్న సమయంలో ఏదైనా నిర్ణయంపై మేము ఏకాభిప్రాయానికి రావటం కష్టమైంది. ఎందుకంటే సిటీ ఇండిపెండెంట్ గ్రూపులో చాలా మందికి విభిన్న అభిప్రాయాలున్నాయి. కానీ మా పార్టీ నిర్ణయాలు, మా పనితీరును చూసి ఆ గ్రూపులోని నలుగురు సభ్యులు ఓటింగ్‌కు మూడు వారాల ముందు మాకు మద్దతు ఇచ్చారు. దాంతో సిటీ ఇండిపెండెంట్ గ్రూపు అభ్యర్థిని కాకుండా మా పార్టీకి చెందిన రాస్ఇర్విన్ను బరిలో ఉంచాం.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లార్ట్ మేయర్ తన విధుల్లో ఉన్న ఇబ్బందులపై కామెంట్ చేశారు. మేయర్, లార్డ్ మేయర్‌కు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది?
ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దాదాపు 95 శాతం మందికి సరిపోయే చికిత్సకు సంబంధించి, ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు నిధులు కేటాయించారు. దీని వల్ల దేశ ఆదాయం 20 శాతం తగ్గింది. గత కొద్దిరోజులుగా 7 శాతం మేర ఆదాయం పుంజుకున్నప్పటికీ ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. ఈ సమయంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వచ్చే ఎనిమిది నెలల్లో ఈ పరిస్థితుల నుంచి బయటపడే ఉద్దేశంతో లార్డ్ మేయర్ ఆ విధంగా మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెగ్జిట్ విషయంలో టోరి(కన్జర్వేటివ్) పార్టీ ప్రతికూలతను కన్జర్వేటివ్ సభ్యులు ఏ విధంగా అధిగమించగలరు?
ఈ విషయంలో ప్రతికూలత ఏది లేదు. గత డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్నా 80 సీట్లు సాధించింది. బ్రెగ్జిట్ జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రజలు మాకు సహకారం అందించారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు నిరసన తెలపడం తప్ప ఈ విషయంలో ప్రతికూలత ఏమీ లేదు.
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ చాలా బలమైన నాయకుడు. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది?
ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను బోరిస్ జాన్సన్‌ని కలిశాను. ఆయన ఎంతో కలివిడిగా ఉంటారు. వ్యక్తిగతంగా ఆయన్ని మూడు సార్లు కలిశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది.
కన్జర్వేటివ్ పార్టీలో ఆసియా, భారతీయులకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది?
కన్జర్వేటివ్ పార్టీ మొదటి నుంచి అందరినీ సమానంగా చూస్తూ కలుపుకొని వెళ్తోంది. మన భారతీయులు ముఖ్యంగా ఆసియాకు చెందిన వారు లేబర్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. గత రెండు ఎన్నికల నుంచి దీనిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిలో ఛాన్సలర్ మన భారతీయుడే. వ్యాపార కార్యదర్శి భారతీయుడే. హోం కార్యదర్శి ప్రీతీ పటేల్ మన భారతీయుడే. ముగ్గురు బలమైన నాయకులు మన భారతదేశానికి చెందిన వారు కావటం మనకు గర్వకారణం.ఏ పార్టీ ఇప్పటి వరకూ ఇండియాకు ఇలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.
ఎన్నికల ప్రచారం, ఓటింగ్ సమయంలో పాకిస్థాన్ సంతతికి చెందిన కౌన్సెలర్లు మీకు మద్దతు తెలిపారు. వైవిధ్యతకు దీన్ని ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. దీని గురించి వివరంగా చెప్తారా?
మా పార్టీలో ఉన్న 19 మంది ఛాన్సలర్లలో ముగ్గురు వ్యక్తులు పాకిస్థాన్ సంతతికి చెందిన వారు. మొదటి నుంచి మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. రాజకీయాలు వేరు.. ప్రజలు తీరు మరో విధంగా ఉంటుంది. అందరం కలిసి మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి వీలుంటుంది.
ఇండియా, బ్రిటన్ రెండూ పెద్ద దేశాలు. దాంతో పాటు ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే దేశాలు కూడా. ఈ రెండు దేశాలను దగ్గరగా చూసుంటారు. భారత రాజకీయ వ్యవస్థకు అక్కడి వ్యవస్థకు మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి?
రెండూ గర్వించదగ్గ ప్రజాసామ్య దేశాలు. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయటానికి ఇక్కడ ఎవరైనా ముందుకెళ్లొచ్చు. ఇండియాలో నేను ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కృషి చేశాను. కానీ నా దగ్గర అంగ, అర్థ బలం లేకపోవటంతో అవకాశాలు రాలేదు. ఇక్కడి లాగే భారతదేశంలో కూడా ప్రజలు అభ్యర్థి గుణగణాలు చూసి ఓట్లు వేస్తే చాలా మంచి జరుగుతుంది.
కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో మీరు జనరల్ ప్రాక్ర్టిషనర్గా ప్రజలకు చాలా సేవ చేశారు. కొవిడ్‌ను కట్టడి చేయటానికి, ప్రజలను ఆదుకోడానికి అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?
ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఆర్థికంగా చాలా సాయం చేసింది. కొవిడ్ కట్టడి విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంది. కరోనా బారిన పడిన వారికి సేవలందించటానికి ఏడు నైటింగేల్ ఆసుపత్రులను ప్రారంభించాం. ఐసీయూల్లో అదనపు పడకలు ఏర్పాటు చేశాం. వ్యాక్సిన్ కోసం ఎన్నో మిలియన్ పౌండ్లు కేటాయించింది. నవంబరు కల్లా వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కష్టపడుతోంది.
కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కొంత విరామం తర్వాత తిరిగి మొదలైంది. అన్నింటికంటే ముందు వరుసలో ఉన్న ఈ వ్యాక్సిన్ పురోగతిపై ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందా?
టీకా అభివృద్ధిలో ఇప్పటి వరకూ చాలా అనుకూల ఫలితాలు వచ్చాయి. సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి రానుంది. భద్రతా ప్రమాణాలకు లోబడే టీకా తయారవుతోంది. అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకొన్న తర్వాతే టీకాను విడుదల చేస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్‌గా ఎవరంటే?
-
General News
Andhra news: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్ల ఎత్తివేత
-
Sports News
Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
-
Crime News
Crime News: చేపల వేటకు వెళ్లి ఒకరు.. కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు గల్లంతు
-
Movies News
Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
-
General News
Weight Loss: లావుగా ఉన్నామని చింతిస్తున్నారా...? ప్రత్యామ్నాయం ఉంది కదా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- Smoking In Plane: విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్..!
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?