
మొదటి మహిళగా ‘జిల్’ మననుందా..!
వాషింగ్టన్: అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు వస్తోన్న ఫలితాలను చూస్తే బైడెన్‌కే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన ఆయన సతీమణి జిల్ బైడెన్ ఈసారి అమెరికా తొలి మహిళగా ‘జిల్’మనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బైడెన్ జీవితంతోపాటు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జిల్‌బైడెన్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఇదివరకు రెండు పర్యాయాలు అమెరికా రెండో మహిళగా ఉన్నత బాధ్యతలు చేపట్టిన జిల్ బైడెన్, తనకు ఇష్టమైన వృత్తిని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ వెన్నంటే ఉండి అనునిత్యం ఆయనకు అండగా నిలబడ్డారు. ప్రచారంలో భాగంగా ఓసారి బైడెన్ పైకి నిరసనకారులు దూసుకొచ్చిన సమయంలోనూ జో బైడెకు రక్షణగా నిలబడి అందర్నీ ఆకర్షించారు.
జిల్-బైడెన్ కుటుంబం..
న్యూజెర్సీలో 1951 సంవత్సరంలో జన్మించిన జిల్ బైడెన్ పెన్సిల్వేనియాలో పెరిగారు. 1977 జూన్ 17న జో బైడెన్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కూతురు అశ్లే (39) సామాజిక కార్యకర్తగానూ, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుపొందారు. అయితే, జిల్కు ఇది రెండో వివాహం. అంతకుముందు మొదటి భర్త బిల్ స్టీవెన్సన్తో 1974లో ఆమె విడిపోయారు.
జిల్‌తో వివాహానికి ముందు జో బైడెన్‌కు నైలియా హంటర్‌తో వివాహం అయ్యింది. బైడెన్-నైలియా దంపతులకు ముగ్గురు (జోసెఫ్ బియూ బైడెన్, రాబెర్ట్ హంటర్ బైడెన్, నవోమీ క్రిష్టియానా హంటర్ ) పిల్లలు. అయితే, 1972లో జరిగిన కారు ప్రమాదంలో నైలియా హంటర్, కూతురు నవోమీ క్రిష్టియానా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో ఇద్దరు కుమారులు జోసెఫ్ బియూ, రాబెర్ట్ హంటర్లు గాయాలతో బయటపడ్డారు. అయితే, వీరిలో బియూ బైడెన్(46) 2015లో మరణించారు.
ప్రొఫెసర్‌గా జిల్ సేవలు..
వృత్తిరీత్యా బోధనా రంగంలో ఉన్న జిల్ బైడెన్ 1970 నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. 2007లో యూనివర్సిటీ ఆఫ్ డెలావర్ నుంచి జిల్ డాక్టరేట్ పొందారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసిన జిల్ బైడెన్, ప్రస్తుతం నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ప్రస్తుతం జో బైడెన్ ఎన్నికల ప్రచారం కోసం ఆమె తాత్కాలిక బ్రేక్ తీసుకున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం మళ్లీ తన బోధనా వృత్తిలో కొనసాగేందుకే సిద్ధమైనట్లు సమాచారం. అంతకుముందు, బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ దేశ రెండో మహిళగా జిల్, ఓవైపు అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఈసారి బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే కూడా.. ప్రథమ మహిళగా ఉంటూనే ప్రొఫెసర్‌గా సేవలందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.