
జిల్కు పాలసీ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో మహిళ శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో చేరనున్నారు. కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగాను నియమిస్తున్నట్లు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. జిల్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా ప్రచార బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు.
మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో మాలా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇల్లినాయిస్కు చెందిన ఈమె గ్రిన్నెల్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2008లో ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఒబామా అధికారంలోకి వచ్చిన తర్వాత అసోసియేట్ అటార్నీ జనరల్ కౌన్సిల్లో సభ్యురాలిగా చేరారు.
మాలాతో పాటు తన పాలకవర్గంలో చేరనున్న మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లను శుక్రవారం జో బైడెన్ ప్రకటించారు. వీరంతా వివిధ వర్గాలకు చెందిన వారని.. అమెరికా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ మా బృందానికి అదనపు సిబ్బందిగా వీరిని నియమించడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. విపత్కాలంలో ఉన్న అమెరికాను మార్చడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ రోజు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వారి అంకితభావం, భిన్న నేపథ్యాలు, అనుభవాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. న్యాయమైన, సమానమైన, ఐక్యమైన దేశాన్ని సృష్టించడానికి వీరు కృషి చేయనున్నారు’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.