
టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ మంగళవారం కొవిడ్-19 టీకా తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకోవడాన్ని టీవీలో లైవ్ ఇవ్వడం విశేషం. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లను సమీపిస్తోంది. 3 లక్షల 35 వేలకు పైగా ప్రజలు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రో-అమెరికన్లలో కొవిడ్ కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. అంతేకాకుండా టీకాను తీసుకోవటానికి వారు అంతగా ఆసక్తిచూపటం లేదని సర్వే ఫలితాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో.. వాషింగ్టన్‌లోని ఆఫ్రికన్ అమెరికన్ల జనాభా అధికంగా ఉండే ప్రాంతంలోని యునైటెడ్ మెడికల్ సెంటర్లో టీకా వేయించుకోవాలన్న కమలా హ్యారిస్ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
‘‘కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తుచేయాలనుకుంటున్నాను. ఈ టీకాను మీరున్న ప్రాంతంలోనే, మీకు పరిచయం ఉన్న వారి ద్వారానే తీసుకునే అవకాశం ఉందని తెలిపేందుకు సంతోషిస్తున్నాను’’ అని టీకా తీసుకున్న అనంతరం ఆఫ్రికన్ అమెరికన్లతో పాటు అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కాగా, నవంబర్ 3 నాటి అగ్రరాజ్య ఎన్నికల్లో గెలిచి, జనవరి 20,2021న ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ స్థానానికి చేరుకున్న తొలి మహిళగా, ఇండియన్ అమెరికన్‌గా, నల్ల జాతి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.