
జార్జియాలో డెమొక్రాట్ల ‘జో’రు
ఆధిక్యంలోకి వచ్చిన బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఐదు రాష్ట్రాల్లో లెక్కింపు కొనసాగుతుండటం, ఆయా స్థానాల్లో ప్రధాన అభ్యర్థులిద్దరి మధ్యా పెద్దగా అంతరం లేకపోవడంతో పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఇక లెక్కింపు జరుగుతున్న రాష్ట్రాల్లో జార్జియా ప్రస్తుతం కీలకంగా మారింది. అక్కడ అభ్యర్థుల మధ్య గెలుపు దోబూచులాడుతోంది. ఇప్పటివరకు ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. తాజాగా బైడెన్ దూసుకొచ్చారు. మరోవైపు సెనెట్‌లో బైడెన్ భవితవ్యం కూడా జార్జియా ఫలితంపైనే ఆధారపడటంతో ఇప్పుడు అందరిచూపు ఆ రాష్ట్రంపైనే పడింది.
బైడెన్ ముందంజ..
ఒకప్పుడు రిపబ్లికన్లకు మంచి పట్టున్న జార్జియాలో ఇటీవల పరిస్థితులు మారుతూ వచ్చాయి. తాజా ఎన్నికల్లో అది స్పష్టంగా కనబడింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో తొలుత ట్రంప్ ఆధిక్యం కనబర్చినప్పటికీ క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ట్రంప్‌ను దాటి బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. బైడెన్ 917 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. బైడెన్ గెలిస్తే ఈ ఓట్లన్నీ ఆయనకే పడతాయి. దీంతో ట్రంప్ అధ్యక్ష ఆశలు ఇక గల్లంతైనట్లే. జార్జియాలో ఓడిపోయి మిగతా నాలుగింటిలో గెలిచినా ట్రంప్ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేరు. 2016లోనూ ట్రంప్.. అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై కేవలం 5శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు.
రీకౌంటింగ్ జరుగుతుందా?
ఇదిలా ఉండగా జార్జియాలో రీకౌంటింగ్ దిశగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. గెలుపు మార్జిన్ 0.5శాతం, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఓడిపోయిన అభ్యర్థి రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. అయితే ఫలితాలు వెలువడిన రెండు రోజుల్లోపే సదరు అభ్యర్థి పునఃలెక్కింపునకు అభ్యర్థించాలి. ఒకవేళ తాజా ఫలితాల్లో ట్రంప్ ఓడిపోతే ఆయనకు రీకౌంటింగ్ కోరే హక్కు ఉంటుంది.
జార్జియా ఫలితం.. సెనెట్‌పై ప్రభావం
కాగా.. జార్జియాలో బైడెన్ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమొక్రాటిక్ పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ జార్జియాలో ఓడిపోయి.. బైడెన్ అధ్యక్షుడైతే(మిగిలిన రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు వస్తే) మాత్రం సెనెట్‌లో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..
ఇక ఫలితం తేలని మిగతా నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, అలస్కా, నార్త్ కరోలినాలో ట్రంప్ ముందంజలో ఉండగా.. నెవడాలో మాత్రం బైడెన్ దూసుకెళ్తున్నారు. జార్జియా, నెవాడా డెమొక్రాట్ల వశమైతే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపు ఖాయమైనట్లే.
ఇవీ చదవండి..
అరిజోనాలో ట్రంప్ వర్గం ఆందోళన
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.