Updated : 07 Nov 2020 15:49 IST

అమెరికా.. ఇప్పుడు బనానా రిపబ్లిక్ ఎవరు?

ఎన్నికలపై అమెరికాను ఏకిపారేస్తున్న ప్రపంచ దేశాలు

బొగొటా(కొలంబియా): అవకతవకలంటూ నిరాధారమైన ఆరోపణలు.. ప్రత్యర్థిపై ‘దొంగతనం’ ముద్ర.. ఓట్ల లెక్కింపు ఆపాలంటూ డిమాండ్లు.. అగ్రరాజ్య ఎన్నికల ఫలితాల విషయంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవర్తిస్తున్న తీరుకు ప్రపంచ దేశాలు నివ్వెరబోతున్నాయి. ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంలా భావించే అమెరికాలో ఇంత రాజకీయ అస్థిరత్వమా అంటూ నోరెళ్లబెడుతున్నాయి. కొన్ని దేశాలైతే ‘ఇప్పుడు బనానా రిపబ్లిక్‌’ ఎవరంటూ అగ్రరాజ్యాన్ని ఏకిపారేస్తున్నాయి. 

ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా సాధారణంగా ఎప్పుడూ ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం చూస్తూనే ఉంటాం. ఆ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా పరిపాటే. అంతేకాదండోయ్‌.. ఎన్నికలు ఎలా జరపాలో కూడా వాషింగ్టన్‌ పలు దేశాలకు పదే పదే సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. అయితే అలాంటి అగ్రరాజ్యంలో ఇప్పుడు ఎన్నికల అనిశ్చితి నెలకొంది. ఇంకేముంది.. ఒకప్పుడు అమెరికా వేలెత్తి చూపిన దేశాలే.. ఇప్పుడు తిరిగి ప్రశ్నిస్తున్నాయి. 

అమెరికా ఎన్నికల ఫలితాలపై కాంబోడియాకు చెందిన మీడియా సంస్థ పబ్లిమెట్రో తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేసింది. ‘ఇప్పుడు బనానా రిపబ్లిక్‌ ఎవరు?’ అంటూ అగ్రరాజ్యాన్ని ఎద్దేవా చేసింది. అమెరికా ఎప్పుడూ టార్గెట్‌ చేసే ఆఫ్రికాలో ఓ కెన్యా కార్టూనిస్ట్‌ ట్రంప్‌ను విమర్శిస్తూ కార్టూన్‌ గీశారు. శ్వేతసౌధాన్ని వదిలి రానని ట్రంప్‌ పట్టుబడుతున్నారని ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. టాంజానియా, ఐవరీ కోస్ట్‌ దేశాలు కూడా అమెరికాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ‘ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణగా ఉండే అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఇంత పేళవమా?’ అంటూ విమర్శిస్తున్నాయి. 

స్వతంత్ర ఎన్నికల కమిషన్‌ ఉండాలని, ఏకరూప ఓటర్ల జాబితా రూపొందించుకోవాలని ఇతర దేశాలకు చెప్పే అమెరికాలోనే అవేవీ లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా దేశాలు ఇప్పుడు అగ్రరాజ్యంపై ప్రతిదాడి చేస్తున్నాయి. ‘ఆఫ్రికాలో కొన్ని ఎన్నికలు ఇంతకంటే మంచిగా జరిగాయి’ అని ఆఫ్రికా ప్రజాస్వామ్యంపై పుస్తకం రచించిన ప్రొఫెసర్‌ నిక్‌ చీజీమన్‌ అమెరికాను విమర్శించారు. ఎన్నికల విధానంపై అధ్యక్షుడే అనుమానాలు వ్యక్తం చేయడం ఈ విమర్శలకు దారితీస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా.. అమెరికా అధ్యక్ష పీఠం ఎవరు ఎక్కుతారని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం డెమొక్రాటిక్‌ నేత బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ట్రంప్‌ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరి శ్వేతసౌధంలో అడుగుపెట్టేది ఎవరో తేలాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే..!

(బనానా రిపబ్లిక్‌ అంటే రాజకీయంగా అస్తవ్యస్థంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను బనానా రిపబ్లిక్‌ అని వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఒక దేశం ఒకే వస్తువులను ఎగుమతులు చేస్తూ దానిపైనే ఆధారపడివుండటాన్ని కూడా బనానా రిపబ్లిక్‌గా పేర్కొంటారు. ఈ పదాన్ని ప్రముఖ అమెరికన్‌ రచయిత ఒ. హెన్రీ తన  పుస్తకం ‘క్యాబేజ్‌స్‌ అండ్‌ కింగ్స్‌’లో తొలిసారిగా వాడారు.  అప్పట్లో మధ్య అమెరికాలోని హోండూరస్‌ దేశం అమెరికా కంపెనీ చేతిలో దోపిడికీ గురయ్యేది.ఎక్కువగా అరటిపండ్ల ఎగుమతులపై ఆధారపడివుండేది.  అమెరికా విధానాలను  విమర్శిస్తూ ఆయన హోండూరస్‌ను బనానా రిపబ్లిక్‌గా పిలిచారు.  ఇప్పటికీ ఏదైనా దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడి ఒక ఏకీకృతమైన విధానం లేక పోతే బనానా రిపబ్లిక్‌గా విమర్శిస్తుంటారు.)

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని