
అమెరికా చరిత్రలో రికార్డుస్థాయి ముందస్తు ఓటింగ్
న్యూయార్క్: పోలింగ్‌కు మరో తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఉండటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. కరోనా ఉద్ధృతి వేళ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసేందుకు భయపడుతున్న అమెరికన్లు బ్యాలెట్, ఈమెయిల్ ద్వారా ముందస్తుగా రికార్డుస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉండగా.. అందులో దాదాపు 5కోట్ల 90లక్షల మందికి పైగా ఓటు వేశారు. అమెరికాలో ఇప్పటివరకు నమోదు కానంత స్థాయిలో టెక్సాస్ రాష్ట్రంలో ఈ శతాబ్దంలోనే అత్యధిక ముందస్తు ఓటింగ్ శాతం నమోదైంది. పోలింగ్ శాతం గతంలో కంటే భారీగా నమోదవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేసేందుకు భయపడుతున్న అమెరికాన్లు.. బ్యాలెట్, ఈ మెయిల్ ద్వారా ముందుగానే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముందస్తు ఓటుహక్కు వినియోగించుకొనేందుకు మరో తొమ్మిది రోజుల సమయం ఉండగానే.. 2016లో నమోదైన ఓట్ల కంటే ఈ ఏడాది ఎక్కువ ఓట్లు నమోదైనట్టు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న స్వతంత్ర అమెరికా ఎన్నికల ప్రాజెక్టు వెల్లడించింది.
ట్రంప్ ధీమా
ఇప్పటికే 5.90కోట్ల మంది ఓటువేయగా.. 2016లో ఈ సమయానికి 5.70కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2016 ఎన్నికల్లో దాదాపు 13.70కోట్ల మంది ముందస్తు ఓటుహక్కు వినియోగించుకోగా.. ఈ ఏడాది సుమారు 15కోట్ల మంది ముందస్తుగా ఓటువేసే అవకాశం ఉందని అంచనా వేసింది. ముందస్తు ఓటింగ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ వైపు మొగ్గుచూపుతున్నా.. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఇదంతా తలకిందులవుతుందని ట్రంప్ ధీమాతో ఉన్నారు.
టెక్సాస్‌లో గత రికార్డులు కనుమరుగు
టెక్సాస్ రాష్ట్రంలో అక్టోబర్ 13న ప్రారంభమైన ముందస్తు ఓటింగ్‌లో గత రికార్డులు కనుమరుగవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 70లక్షల మంది ఓటు వేయగా.. ఇది ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం ఓట్లలో 43 శాతమని అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 26వేల మంది ముందస్తు ఓటు వేశారని అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో 2016లో ట్రంప్ విజయం సాధించగా.. ఈసారి బైడెన్ గెలిచే అవకాశం ఉందని జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. టెక్సాస్‌లో ఓటింగ్‌పై క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మెయిల్, బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటు వేసేవారిలో 63శాతం బైడెన్‌కు, 31శాతం ట్రంప్‌కు మద్దతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేస్తామని చెప్పినవారిలో 62శాతం మంది ట్రంప్‌నకు, 32శాతం మంది బైడెన్‌కు మద్దతిస్తున్నామని వెల్లడించారు.
యువత బైడెన్ వైపే: ఎగ్జిట్ పోల్స్
కరోనా నుంచి ప్రజల్ని కాపాడటంలో ట్రంప్ సామర్థ్యంపై నమ్మకంలేదని 44శాతం మంది వెల్లడించగా.. అమెరికా ఆర్థికవ్యవస్థను నిర్వహించగల సామర్థ్యం బైడెన్ కంటే ట్రంప్‌నకే ఎక్కువ ఉందని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సున్నవారు బైడెన్ వైపు మొగ్గు చూపగా.. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ట్రంప్ వైపు నిలబడ్డారని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.