
మిలియన్ డాలర్లు చెల్లించాను: ట్రంప్
క్లీవ్లాండ్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మొదటిసారి అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ముఖాముఖి చర్చలో తలపడ్డారు. ఈ క్రమంలో తాను మిలియన్ల డాలర్ల పన్ను చెల్లించానంటూ.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తనపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు. ట్రంప్ ఫెడరల్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేసినట్లు కొద్ది రోజుల క్రితం న్యూయార్క్ టైమ్స్ ఆధారాలతో సహా ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల బరిలో నిలిచిన 2016లో, శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన తొలి సంవత్సరం 2017లోనూ ట్రంప్ 750 డాలర్లు మాత్రమే చెల్లించినట్లు దాంట్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. గత 15 ఏళ్లలో మొత్తం 10 సంవత్సరాలు ఆయన ఫెడరల్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టలేదని తెలిపింది. కాగా, ఆ కథనంలోని వివరాలన్నీ అవాస్తవాలంటూ ట్రంప్ కొట్టిపారేశారు.
అయితే, తాజాగా జరిగిన ముఖాముఖిలో భాగంగా సంధానకర్తగా ఉన్న క్రిస్ వాలెస్ న్యూయార్క్ కథనం గురించి ప్రస్తావించారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ..నేను మిలియన్ల డాలర్లు పన్నుగా చెల్లించాను. ఆదాయ పన్ను రూపంలో మిలియన్ల డాలర్లు చెల్లించాను’ అని చెప్పారు. కానీ, ఎంతమొత్తం చెల్లించారో మాత్రం వెల్లడించలేదు.
ఈ చర్చకు ముందే ట్రంప్ పన్ను చెల్లింపుల గురించి ట్వీట్ చేశారు. ‘నేను మిలియన్ల డాలర్ల కొద్ది పన్ను చెల్లించాను. కానీ, ఇతరులవలే నాకు ట్యాక్స్ క్రెడిట్స్ లభించాయి. నా ఆస్తుల విలువతో పోల్చుకుంటే నాకు అప్పులు చాలా తక్కువగా ఉన్నాయి’ అంటూ తన పరపతి గురించి వెల్లడించారు.