
సతీశ్ ధుపేలియా మృతికి ప్రసాద్ తోటకూర సంతాపం
డల్లాస్: భారత జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవడు సతీశ్ ధుపేలియా మరణంపై మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర విచారం వ్యక్తంచేశారు. గత నెల రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈ నెల 22న మృతిచెందడం బాధాకరమన్నారు. మూడు రోజుల క్రితమే ఆసుపత్రిలోనే సతీశ్ తన 66 పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారని గుర్తుచేసుకున్నారు. 2014 అక్టోబర్ 2న అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ను డల్లాస్‌లో సతీశ్ ధుపేలియా చేతులమీదుగానే ఆవిష్కరింపజేసుకోవడం ఒక మధురానుభూతి అని చెప్పారు. విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివవరప్రసాద్ తయారుచేసిన ఈ విగ్రహాన్ని చూసిన సతీశ్.. తన్మయత్వంతో విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుందని ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. అమెరికాలో ఆయన ఉన్న నాలుగు రోజులూ డల్లాస్‌లో అనేక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు.
మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ఆకస్మిక మృతిపట్ల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూరతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రావు కల్వల, మురళీ వెన్నం, జాన్ హేమండ్, రన్నా జాని, అభిజిత్ రాయల్కర్, స్వాతి షా, శైలేష్ షా, లోక్‌నాథ్ పాత్రో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సతీశ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.