
జార్జియాలో తగ్గిన ట్రంప్ ఆధిక్యం..!
ఐదు రాష్ట్రాల్లో ఇదీ ప్రస్తుత పరిస్థితి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తదుపరి అధ్యక్షుడెవరని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉంది. దీంతో విజేత ఎవరనేది తేలడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కి అనుకూలంగా ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాలో ఆయన ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తుండడం మరింత ఉత్కంఠకు తెరతీస్తోంది. ఒక్క నెవాడా మినహా కౌంటింగ్ జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ట్రంపే ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు మధ్య అంతరం మాత్రం పెద్దగా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..!
జార్జియా: ఇక్కడ పోరు క్షణక్షణం రసవత్తరంగా మారుతోంది. తొలి నుంచి ముందంజలో ఉన్న ట్రంప్ ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇంకా కేవలం ఒక శాతం అంటే 50,000 ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది. ఇప్పుడు ట్రంప్ కేవలం 1,772 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడి ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 16. ఇది ట్రంప్ గెలుచుకుంటే విజేతపై ఇంకొంత సమయం వేచిచూడాల్సిందే. ఒకవేళ బైడెన్ పై చేయి సాధిస్తే ట్రంప్‌నకు విజయావకాశాలు గల్లంతైనట్లే. మిగతా నాలుగింటిలో ట్రంప్ గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేరు.
పెన్సిల్వేనియా: ఇక్కడ పోరు తొలి నుంచి ట్రంప్‌నకు అనుకూలంగా ఉంది. ఇంకా 10 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ట్రంప్ 41,962 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే, గత కొన్ని గంటలుగా ఇద్దరి అభ్యర్థుల మధ్య అంతరం తగ్గుతూ వస్తుండడం గమనార్హం. ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 20
నెవాడా: ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న ఈ రాష్ట్రంలో ఫలితాలు తొలి నుంచి బైడెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం 11,438 ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 16 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. బైడెన్ తన ఆధిక్యతను అలాగే కొనసాగిస్తూ విజయం సాధిస్తే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంటారు. మిగతా నాలుగింటిలో ట్రంప్ నెగ్గినా బైడెన్‌ను చేరుకోలేరు.
నార్త్ కరోలినా: పోలైన ఓట్లలో ఇంకా ఆరు శాతం లెక్కించాల్సి ఉంది. 15 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 76,701 ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ నెల 12 వరకూ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించనున్నారు.
అలస్కా: ఇక్కడా అభ్యర్థుల మధ్య భారీ తేడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ట్రంప్ 54,610 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 50 శాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య మూడు.
అయితే, ఒకవేళ బైడెన్ మెజార్టీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నా.. వెంటనే అధికారికంగా విజేతగా ప్రకటించే అవకాశాలు లేవు. ట్రంప్ న్యాయపోరాటానికి సిద్ధమవడంతో తుది విజేత కోర్టులోనే తేలే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇవీ చదవండి..
లీగల్ ఓట్లు లెక్కిస్తే విజయం నాదే: ట్రంప్
మొదటి మహిళగా ‘జిల్’ మననుందా..!