Published : 11 Nov 2020 10:50 IST

వారు బైడెన్‌ను అభినందించలేదే..!

 కీలక ప్రపంచ నేతల నుంచి స్పందన కరవు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నిక ఖాయం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. కానీ, కొన్ని కీలక దేశాల అధినేతలు మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉన్నారు. వారి నుంచి ఎలాంటి అభినందన సందేశాలు వెలువడలేదు. ట్రంప్‌ శ్వేత సౌధంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన నియంతల వంటి నాయకుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా, చైనా, బ్రెజిల్‌, టర్కీ అధినేతల నుంచి ఎటువంటి స్పందన  వెలువడలేదు. చాలా మంది ఇంకా అధికారికంగా ప్రకటించేలేదు కదా.. ఆ ప్రకటన వచ్చాక స్పందిస్తామని చెబుతున్నారు. 

పుతిన్‌ అప్పట్లో ఇలా..

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం ఖాయమైనట్లు మీడియా సంస్థలు ప్రకటించిన కొన్ని గంటల్లో క్రెమ్లిన్‌ స్పందించింది. కానీ, ఈ సారి మాత్రం మౌనం పాటిస్తోంది. దీనిపై పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ  ‘‘అధికారికంగా ఫలితం ప్రకటించాక స్పందించాలని మాస్కో భావిస్తోంది’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్‌ ఎన్నిక సమయంలో స్పందించడానికి కారణం ఉంది.  అప్పట్లో ప్రచార సమయంలో కూడా ట్రంప్‌ రష్యా విషయంలో సానుకూలంగా ఉన్నారు. రష్యాతో స్నేహం పెంచుతానని ప్రకటించారు. రష్యా ఎస్‌400 వంటి ఆయుధ ఎగుమతులపై బలంగా స్పందించలేదు. 

అదే ఎన్నికల్లో రష్యా ట్రంప్‌కు సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇప్పడు పరిస్థితి వేరు. గత ఎన్నికల్లో డెమొక్రాట్లు ఓడిపోవడానికి రష్యా కారణమనే బైడెన్‌ భావిస్తున్నారు. దీనికి తోడు ఆయన రష్యానే అమెరికాకు అతిపెద్ద శత్రువని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ అధికారం చేపట్టాక మాస్కోపై ఆంక్షలు పెరగవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీపై హత్యా యత్నం కూడా కలిసి బైడెన్‌కు ఓ ఆయుధమయ్యే అవకాశం ఉంది. 

ఆచితూచి చైనా అడుగులు..

2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం ఖాయమైన  తర్వాత కూడా చైనా నేత షీ జిన్‌పింగ్‌ స్పందించలేదు. 2016లో మాత్రం ఆయన దీనికి భిన్నంగా వ్యవహరించారు. అమెరికా-చైనా సంబంధాలు బలంగా.. స్థిరంగా ముందుకు వెళ్లాలని ఆశించారు. కానీ, అప్పట్లో షీ జిన్‌పింగ్‌ వ్యూహం బెడిసికొట్టింది. పక్కాలెక్కలతో ఉండే ట్రంప్‌తో స్నేహం చాలా కష్టమని  మార్‌-ఎ-లాగో డిన్నర్‌ తర్వాత అర్థమైపోయింది. అక్కడి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పతనం అవుతూనే వచ్చాయి. తాజాగా కోవిడ్‌ వ్యాప్తితో ఇవి పూర్తిగా పడిపోయాయి. ఇప్పుడు బైడెన్‌కు ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. చైనాతో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చైనా ఆచితూచి స్పందిస్తోంది. ‘అంతర్జాతీయ సంప్రదాయాల ప్రకారం’ వ్యవహరిస్తాం అని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. 

ఎర్డగాన్‌ పరిస్థితి అగమ్యగోచరం..

ఇస్లాం దేశాలకు నాయకత్వం వహిద్దామని ఇటీవల కాలంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తు్న్న టర్కీ అధినేత ఎర్డగాన్‌కు బైడెన్‌ గెలుపు సవాలుగా మారే అవకాశం ఉంది. గతంలో టర్కీలో తిరుగుబాటును ఎర్డగాన్‌ అణిచివేశారు. దీనికి తోడు టర్కీ విషయంలో ట్రంప్‌ ఉదారంగా వ్యహరించారు. సిరియా నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవడంతో టర్కీ ఈ ప్రాంతంలో బలపడింది. అదే సమయంలో నాటో భద్రత ప్రమాదంలో పడేలా రష్యా ఆయుధాలను టర్కీ కొనుగోలు చేస్తోంది. కానీ బైడెన్‌ అధికారం చేపడితే ఈ ఆటలు సాగవు. గతంలో సిరియాలో టర్కీకి వ్యతిరేకంగా అమెరికా బలగాలు రంగంలోకి దిగాయి. అప్పుడు బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడెన్‌ మాట్లాడుతూ ‘‘టర్కీ తీరు ఆందోళనకరంగా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఇరుదేశాల సంబంధాల్లో మార్పువస్తుంది. కుర్దులకు మద్దతు ఇస్తాము’’ అని పేర్కొన్నారు.  ఈ విషయం టర్కీ అధినేత ఎర్డగాన్‌కు మింగుడుపడలేదు. అందుకే ఇప్పటి వరకు టర్కీ నుంచి ఎటువంటి అభినందన సందేశం వాషింగ్టన్‌కు చేరలేదు. 

అత్యుత్సాహం దెబ్బకొట్టింది..

బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో అత్యుత్సాహం ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. మొదటి నుంచి ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకొన్న బోల్సెనారో బైడెన్‌ను దూరం పెట్టే ప్రయత్నం చేశారు. అమెజాన్‌లో అడవుల నరికివేత ఆపితే 20 బిలియన్‌ డాలర్లు అందజేస్తామని కొన్నళ్లక్రితం బైడెన్‌ తెలిపారు. దీనిని బోల్సెనారో తిరస్కరించారు. ‘‘డబ్బుకు మా దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీపడబోము’’  
అని తెలిపారు. బోల్సెనారో కుమారుడు  అమెరికా వెళ్లినప్పుడు ‘ట్రంప్‌2020’ టోపీ పెట్టుకోవడం వివాదాస్పదం అయింది. దీనికి తోడు ట్రంప్‌ వలే కొవిడ్‌ను తక్కువ చేసి చూపడం కూడా బైడెన్‌తో దూరం పెంచింది. దీంతో ఆయన విజయంపై బోల్సెనారో మౌనంగా ఉన్నారు.   

 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని