Published : 16/12/2020 17:52 IST

బైడెన్‌ను అభినందించిన రిపబ్లికన్‌ సీనియర్లు

బైడెన్‌ విజయాన్ని గుర్తిస్తున్న రిపబ్లికన్‌ నేతలు

వాషింగ్టన్‌: సోమవారం నాటి ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశం జో బైడెన్‌ను అగ్రరాజ్య అధ్యక్షుడిగా, కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకుంది. దీనితో బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అన్ని దారులూ మూసుకుపోయినట్లయింది. ట్రంప్‌ ఇప్పటికీ మంకుపట్టును వదలకున్నా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీలో మార్పు గాలి వీస్తున్న సంకేతాలు స్పష్టమౌతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడు, సెనేట్‌ సభ్యుడైన మిచ్‌ మెక్‌ కానెల్..  ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓటింగులో విజయం సాధించిన బైడెన్‌, హారిస్‌లకు బహిరంగంగా అభినందనలు తెలియచేయటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇకపై ఫలితాలను ప్రశ్నించొద్దు

మిచ్‌ మెక్‌ కానెల్ ప్రస్తుతం కెంటకీ రాష్ట్రం తరపున  సీనియర్‌ సెనేటర్‌గా, సెనేట్‌ మెజారిటీ నేతగా ఉన్నారు.  కెంటకీ నుంచి సుదీర్ఘకాలం పనిచేసిన సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు. ఈయన మార్పునకు అంతగా ఇష్టపడని సంప్రదాయవాది అని రాజకీయ వర్గాలు అంటాయి. పార్టీకి విధేయుడిగా పేరుతెచ్చుకున్న ఈ సెనేటర్‌.. గతంలో కూడా పలు అంశాల్లో ట్రంప్‌ను వ్యతిరేకించారు.  ట్రంప్‌ 2016లో ఓ టీవీ షోలో  మహిళల గురించి అవమానకరంగా మాట్లాడినపుడు .. మహిళలకు గౌరవాన్ని తగిన ఇవ్వాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. అదే సమయంలో  ట్రంప్‌ రద్దు చేసిన ఒబామాకేర్‌ తదితర కార్యక్రమాలను ఆయన వ్యతిరేకించారు. తాజా ఎన్నికల విధానంలో మోసాలు జరిగాయంటూ ఆధార రహితంగా ట్రంప్‌ చేసే ప్రకటనలను సమర్థించనప్పటికీ.. న్యాయస్థానంలో తన వాదనను వినిపించే హక్కు అధ్యక్షుడికి  ఉందంటూ ఆయన  ట్రంప్‌ను సమర్ధిస్తూ వచ్చారు.  మెక్‌ కానెల్ నిజానికి ఈ మంగళవారం వరకు బైడెన్‌ విజయాన్ని గుర్తించేందుకు తిరస్కరించారు. ఐతే, ట్రంప్‌నకు అన్ని చోట్లా చుక్కెదురై.. చివరకు సుప్రీంకోర్టులోనూ ఆయన ఆరోపణలు వీగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నిక విషయాలను స్పష్టం చేసిందని.. అందుకే తాను అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నట్టు మిచ్‌ తాజాగా ప్రకటించారు.

కాలేజ్‌ ఫలితాల లాంఛనప్రాయ లెక్కింపు కాంగ్రెస్‌ జనవరి 6న సమావేశం కానున్న నేపథ్యంలో.. తమపార్టీ సెనేటర్లు ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఫలితాన్ని ప్రశ్నించే ప్రయత్నాలు చేయరాదని కూడా ఆయన సూచించారు. ఈ చర్య  అధ్యక్షుడు ట్రంప్‌ పరాజయాన్ని మరింత స్పష్టం చేసినట్టయింది. వెస్ట్‌ వర్జీనియాకు చెందిన మరో రిపబ్లికన్‌ సెనేటర్‌ షెల్లీ మూర్‌ కూడా  ఫలితాలను అంగీకరించాల్సిందిగా తన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వీరే కాకుండా మిట్‌ రోమ్నీ, కెవిన్‌ మెక్‌ కార్థీ, జాన్‌ థునే  తదితర రిపబ్లికన్‌ నేతలు యదార్ధాన్ని అంగీకరిస్తున్నప్పటికీ..  ట్రంప్‌ మాత్రం ఇంకా తన మొండిపట్టు వీడటం లేదు.

మీతో పనిచేస్తాం..

ఇదిలా ఉండగా, మెక్‌ కానెల్‌ అభినందనలకు గాను జో బైడెన్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. అనుభవజ్ఞుడైన ఆయనతో కొన్ని అంశాల్లో కలసి పనిచేయాల్సి ఉందని బైడెన్‌ అన్నారు. అంతేకాకుండా, తన విజయం అధికారికంగా  ఖాయమైన అనంతరం ఏడుగురు సీనియర్‌ రిపబ్లికన్‌ సెనేటర్లు ఫోన్‌ చేసి.. తమతో పనిచేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారంటూ బైడెన్‌ ప్రకటించటం గమనార్హం. ట్రంప్‌ ప్రభ క్రమంగా మసకబారుతోందని.. ఆయన భారీ మార్పులను చవిచూడబోతున్నారంటూ కాబోయే అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఓటమిని ససేమిరా అంగీకరించనంటున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోట బీటలు వారుతోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఇవీ చదవండి

భారత్‌-చైనా వివాదం: అమెరికా కీలక చర్య

కరోనా టీకా: అమెరికాలో ఆమె.. కెనడాలో ఈమె!

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని