
ప్రవాసాంధ్ర వైద్యుడికి లండన్‌లో అరుదైన గౌరవం
డాక్టర్ ఘట్టమనేనికి ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ అవార్డు
లండన్: యూకేలో తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన డాక్టర్ హనుమంతరావు ఘట్టమనేని ప్రతిష్ఠాత్మక ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. గత 44 ఏళ్లుగా మాంచెస్టర్‌లోని క్రిస్టీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్యుడిగా ఆయన అందించిన విశేష సేవలకు గాను ఈ అవార్డు వరించింది. ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ అవార్డుకు డాక్టర్ ఘట్టమనేని పేరును యూకే పార్లమెంట్ సభ్యుడు జెఫ్ స్మిత్ నామినేట్ చేశారు. పిల్లల్లో క్యాన్సర్ సంబంధ వ్యాధుల నివారణ కోసం ఆయన చేస్తున్న కృషి, క్రిస్టీ ఆస్పత్రిలో సుదీర్ఘకాలంగా నిబద్ధతతో పనిచేస్తున్నందుకు గాను జెఫ్.. ఘట్టమనేని పేరును సిఫారసు చేశారు. యూకే వ్యాప్తంగా ఈ అవార్డుకు 700 దరఖాస్తులు రాగా.. ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ పురస్కారానికి డాక్టర్ ఘట్టమనేని ఎంపికకావడం విశేషం. లండన్‌లోని పార్లమెంటరీ కమిటీ జూన్ 7న ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనుంది.
సృజనాత్మకత, స్థానిక ఆరోగ్య, సంరక్షణ సర్వీసులను రోగులకు అందిస్తున్నవారిని గుర్తించి దాదాపు 260మందికి పైగా ఎంపీలు నామినీలను ముందుకు తీసుకొచ్చారు. అయితే, జీవిత సాఫల్య పురస్కారం కేటగిరీలో ఏడుగురిని షార్ట్‌లిస్ట్ చేయగా.. అందులో చివరకు డాక్టర్ ఘట్టమనేని పేరును ఖరారు చేశారు. కృష్ణా జిల్లాలో జన్మించిన డాక్టర్ ఘట్టమనేని.. కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. చండీగఢ్ నుంచి రేడియో థెరఫీలో ఎండీ చేశారు. ఆ తరువాత ఆయన లండన్‌లోని మాంచెస్టర్‌లో ఉన్న క్రిస్టీ ఆస్పత్రిలో శిక్షణ పొందారు. ఆ ఆస్పత్రి నుంచి ఎఫ్ఆర్సీఎస్ డిగ్రీ సాధించిన ఆయన.. అనంతరం అక్కడే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్లినికల్ అంకాలజీ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నారు. కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసిన సమయంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు, ఈయన రూమ్ మేట్స్ కావడం మరో విశేషం.
సార్కోమా, న్యూరో-ఆంకాలజీ తదితర అంశాలపై ప్రత్యేక నిపుణుడిగా ఉన్న డాక్టర్ ఘట్టమనేని.. పీడియాట్రిక్ అంకాలజీలో మల్టీ డిసిప్లినరీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రోగులకు ప్రయోజనకరమైన క్లినికల్ ట్రయల్స్‌ను అందించిన ఆయన.. 50కి పైగా అకడమిక్ జర్నల్స్ కూడా ప్రచురించారు.