
కరోనా కాలంలో ఇంత మంది తిరిగొచ్చారు
వందే భారత్ మిషన్ వివరాల వెల్లడి
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి తలెత్తిన నాటి నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకున్న 29 లక్షలకు పైగా భారతీయులను స్వదేశానికి తరలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వందేభారత్ మిషన్ కార్యక్రమం కింద నవంబర్ 4 ఒక్క రోజే షార్జా, లండన్, ఫ్రాంక్ఫర్ట్ తదితర ప్రాంతాల నుంచి 5362 భారతీయులను స్వదేశానికి తరలించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, విమానయానశాఖ ఈ మహత్కార్యాన్ని సుసాధ్యం చేశాయని ఆయన ప్రశంసించారు.
‘‘వందేభారత్ మిషన్ ద్వారా అత్యవసర పరిస్థితిలో ఉన్న మన పౌరులను చేరుకోగలిగాం. విదేశాల్లో చిక్కుకున్న 29.33 లక్షల పైగా భారతీయుల అంతర్జాతీయ ప్రయాణానికి ఏర్పాటు చేసి స్వదేశానికి రప్పించాం. ఈ కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాల శాఖ, పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇతర భారతీయ ప్రైవేటు విమాన సంస్థల సమష్ఠి కృషితో ఇది సాధ్యమయింది.’’ అని మంత్రి ట్విటర్లో ప్రకటించారు.
కొవిడ్-19 వ్యాప్తి కారణంగా విమానాల రాకపోకలపై పలు ప్రపంచ దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్ను భారత ప్రభుత్వం మేలో ప్రారంభించింది. కాగా, ఈ కార్యక్రమం ఏడవ దశ అక్టోబర్ 1న ప్రారంభమైంది.