
పుతిన్ పప్పీ మీరు: బైడెన్.. నోరు ముయ్:ట్రంప్
క్లీవ్‌లాండ్: అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో అగ్రరాజ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంగళవారం అధ్యక్ష అభ్యర్థుల తొలి బహిరంగ చర్చ జరిగింది. కొవిడ్-19 నియమాల ప్రకారం కరచాలనం చేయకుండానే కార్యక్రమం మొదలైంది. ‘‘హౌ ఆర్ యూ మ్యాన్?’’ అంటూ డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్షుడు ట్రంప్‌ను పలకరించారు.
అయితే కరోనా వైరస్, తదితర కీలక అంశాల గురించి చర్చించే క్రమంలో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. బైడెన్ ఒక దశలో.. మీరు రష్యా అధ్యక్షుడు పుతిన్ పెంపుడు కుక్క పిల్ల అని ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను పుతిన్‌తో హోరాహోరీ తలపడ్డాను. మేము (అమెరికా) ఏ మాత్రం లొంగలేదనే విషయాన్ని ఆయనకు స్పష్టం చేశాను. కానీ ఈయన (ట్రంప్) పుతిన్ పెంపుడు కుక్క పిల్ల మాదిరిగా వ్యవహరించారు’’ అని బైడెన్ అన్నారు.
అబద్ధాల కోరు అన్న బైడెన్ వ్యాఖ్యలకు సహనం కోల్పోయిన ట్రంప్.. ‘షటప్‘ (నోరు ముయ్) అంటూ ఆగ్రహంతో మండిపడ్డారు. పలు అంశాలపై వీరి మధ్య జరిగిన ఆసక్తికర చర్చ సందర్భంగా ఇరు అభ్యర్థుల వైఖరిని తెలుసుకునేందుకు అమెరికా పౌరులతో సహా ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది.