
ట్రంప్‌కు అవగాహనే లేదు.. బైడెన్వి అబద్ధాలు
ఆసక్తిగా అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చ
క్లీవ్‌లాండ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఈరోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి సంవాదం ఆసాంతం ఆసక్తిగా సాగింది. రిపబ్లిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ వివిధ అంశాలపై తమ వాదనను ప్రజలకు వివరించారు. కరోనా విజృంభణ, నల్లజాతీయుల నిరసనలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్నిక వంటి ఇటీవలి పరిణామాలపై ఇద్దరు అభ్యర్థులు తమ అభిప్రాయాలు, విధానాలను పంచుకున్నారు. క్లీవ్‌లాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరించారు. వివిధ అంశాలపై వారి మనోగతాలు..
రిపబ్లిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఆరోగ్య విధానం..
* మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన ఒబామా కేర్ నిర్వహణే కష్టంగా మారింది. పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా పరిణమించింది.
* ఆరోగ్య బీమాను రద్దు చేయలేదు. తక్కువ ధరలో అందించే ప్రయత్నం చేశాను. ఇటీవల తీసుకొచ్చిన నూతన ఆరోగ్య విధానం అందులో భాగమే.
కరోనా విజృంభణ..
* చైనా ప్లేగ్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థను మూసివేయాల్సి వచ్చింది.
* మా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం వల్లే మరణాలను తగ్గించగలిగాం. లేదంటే 20 లక్షల మంది మృతిచెంది ఉండేవారు.
* మేము అన్ని పారదర్శక విధానాలు అవలంబిస్తున్నాం.
* చైనా, రష్యా, భారత్‌లో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ ఎవరకీ తెలీదు. పత్రికల్లో దుష్ప్రచారం వల్లనే నాకు చెడ్డపేరు.
* కరోనాను ఎదుర్కోవడంలో నా పనితీరుకు ఫౌచీ ప్రశంసలే నిదర్శనం.
* ఈ క్షణం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం. అన్ని సౌకర్యాలు సిద్ధం చేశాం.
* బైడెన్ ఎప్పుడూ 200 అడుగుల దూరం నుంచే ఎదుటివారితో మాట్లాడతారు. నేను ఇప్పటివరకు చూసిన అతిపెద్ద మాస్క్ బైడెన్.
ఆర్థికం, వాణిజ్యం, ఉద్యోగాలు..
* 1929 నుంచి చూస్తే ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకోవటంలో ప్రస్తుతం సమస్యలు ఉన్నాయి. ఆర్థికవ్యవస్థ పున:ప్రారంభం చాలా బలహీనంగా ఉంది.
* నేను 7లక్షల ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చాను, వాళ్లు ఏమీ చేయలేదు.
* క్రమంగా అమెరికా ఆర్థికవ్యవస్థ కరోనా ప్రభావం నుంచి పుంజుకుంటోంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం.
వర్ణవివక్ష.. నిరసనలు..
* 1994 లో తెచ్చిన బిల్లులో డెమొక్రాట్లు ఆఫ్రోఅమెరికన్లను ‘సూపర్ ప్రిడేటర్లు’గా పేర్కొన్నారు. వారిని అంత హీనంగా చూసిన చరిత్ర డెమొక్రాటిక్ పార్టీది.
* డెమొక్రాట్లు మోక్రట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే శాంతిభద్రతలు కాపాడడంలో విఫలమయ్యారు
* వర్ణవివక్షాపూరితంగా ఉన్న కొన్ని విధానాలను సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాం
* డెమొక్రాట్లు అమెరికాను జాత్యంహకారం, భయంకరమైన దేశంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే సమాజంలో ఎంతో అంతరం ఏర్పడింది.
* డెమొక్రాటిక్ పార్టీ అధికారంలో ఉన్న నగరాల్లోనే హింస జరుగుతోంది, శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.
పర్యావరణం..
* స్వచ్ఛమైన పర్యావరణం కోసం మేము కట్టుబడి ఉన్నాం. పారిస్ ఒప్పందం దారుణమైంది.
* పర్యావరణం పేరిట వ్యాపారాలను దెబ్బ తీయొద్దు. సమర్థమైన అటవీ నిర్వహణ రావాలి అన్నదే నా ఉద్దేశం.
* పర్యావరణ పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం
* అటవీ విధానంపై బైడెన్ చెబుతున్న ప్రణాళికలు అమలు చేయాలంటే వంద లక్షల కోట్ల డాలర్లు కావాలి.
ఎన్నికల్లో మెయిల్-బ్యాలెట్ విధానం..
* బ్యాలెట్ విధానం పూర్తిగా ఓ విపత్తు. ఆ విధానంలో ఎన్నో లోటుపాట్లు చోటుచేసుకునే అవకాశం ఉంది. మాన్హాటన్, న్యూజెర్సీ వంటి నగరాల్లో ఏం జరిగిందో చూశాం.
* బ్యాలెట్ విధానాలు పూర్తిగా అసంబద్ధంగా ఉన్నాయి.
* బ్యాలెట్ విధానంలో ఆలస్యం చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలో అక్రమాలకు అవకాశం ఉంది.
* ఓట్ల లెక్కింపు నిజాయతీగా జరగాలి అన్నదే నా అభిప్రాయం.
డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్
ఆరోగ్య విధానం..
* ఆరోగ్య విధానంపై ట్రంప్‌నకు ఎలాంటి ప్రణాళిక లేదు.
* ఒబామా కేర్‌ను రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
* ట్రంప్ విధానాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు
* ప్రజల ఆరోగ్యం కన్నా ఆర్థిక వ్యవహారాలకే ట్రంప్ ప్రాధాన్యం ఇచ్చారు.
కరోనా విజృంభణ..
* కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారు. ఎదురుచూడడం తప్ప ట్రంప్ ఏమీ చేయలేదు.
* కరోనా కట్టడిపై ట్రంప్‌కి ఎలాంటి ప్రణాళిక లేదు. అందువల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
* మహమ్మారి ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ చెప్పేవి అన్నీ అబద్ధాలు.
* ప్రజల ఆరోగ్యం, సామాజిక దూరం పట్టించుకోకుండా ట్రంప్ వ్యవహరించారు. సామాజిక నిబంధనల నేపథ్యంలోనే నేను ప్రజలకు దూరంగా ఉండి మాట్లాడాను.
ఆర్థికం, వాణిజ్యం, ఉద్యోగాలు..
* అమెరికా చరిత్రలో అతి తక్కువ ఉద్యోగాలు కల్పించిన అధ్యక్షుడు ట్రంప్.
* కరోనా తెచ్చిన సంక్షోభం వల్ల చిన్న వ్యాపారాలు పూర్తిగా చితికి పోయాయి.
* ప్రతి ఆరింటిలో ఒక చిన్న వ్యాపారం మూతపడే దుస్థితి తలెత్తింది.
* మేం అధికారంలోకి వస్తే ట్రంప్ కంటే 7మిలియన్ల అధిక ఉద్యోగాలు కల్పిస్తాం. కంపెనీలు కట్టే పన్నుల్లో ప్రతి పైసాకు న్యాయం జరిగేలా చూస్తాం. కార్పొరేట్ పన్నును 28శాతం నుంచి 21శాతానికి తీసుకొస్తాం.
వర్ణవివక్ష.. నిరసనలు..
* అమెరికా చరిత్రలోనే ఇంత జాత్యంహకారం ఉన్న అధ్యక్షుడిని చూడలేదు. ట్రంప్ హయాంలోనే అంతరాలు, హింస పెరిగాయి.
* అమెరికాలో ఆఫ్రో అమెరికన్లు వ్యవస్థీకృత వివక్షకు గురి అవుతున్నారు. మేం అధికారంలోకి రాగానే పౌరహక్కుల సంఘాలు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తాం.
* మనం అందరం అమెరికన్లం, అందరం కలసి ఈ దేశాన్ని నిర్మించుకున్నాం, ఎప్పటికీ మా విధానం అదే.
* నగరాల శివారు ప్రాంతాలే సమస్యాత్మకంగా మారాయి. కొవిడ్ సంక్షోభంలో కూడా అత్యంత ప్రభావితమైన ప్రాంతాలు అవే. అవసరమైన నిధులు కేటాయిస్తాం, వారి సమస్యలు తీరుస్తాం, అదే శాంతిభద్రతలకు రక్ష.
పర్యావరణం..
* పర్యావరణంపై ట్రంప్ అభిప్రాయాలు, ఆలోచనలు పూర్తిగా తప్పు. అమెరికా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు పురోగమించాలి. 2035 నాటికి ఇంధనరంగంలో కాలుష్య ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చాలి.
* మేము అధికారంలోకి వస్తే తిరిగి పారిస్ ఒప్పందంలో చేరతాం. పర్యావరణ పరిరక్షణరీత్యా తప్పనిసరి పర్యావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఏం జరుగుతుందో కళ్లముందే చూస్తున్నాం.
* కొత్త హరిత విధానంలో భాగంగా కాలుష్యకారక కేంద్రాలను మూసివేస్తాం.
ఎన్నికల్లో మెయిల్-బ్యాలెట్ విధానం..
* బ్యాలెట్ మోసాలకు తావు లేదని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. ప్రజలను గందరగోళంలో పడేయడానికే ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. బ్యాలెట్ విధానంపై ఆయనకు ఉన్న అభ్యంతరాలన్నీ అపోహలు.
* నేను గెలిచినా, ఓడినా సంపూర్ణంగా అంగీకరిస్తాను.
* ఈ దేశం రానున్న రోజుల్లో ఎలా ఉండాలన్న నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది. ఆ నిర్ణయాన్ని అందరు ఓట్ల రూపంలో తెలియజేయాలి.
ఇలా గంటన్నర పాటు ఇరువురు అభ్యర్థుల మధ్య చర్చ జరిగింది. కరోనా సంక్షోభం, నల్లజాతీయుల నిరసనలు, ట్రంప్ పన్ను ఎగవేత, విదేశాంగ విధానం వంటి పలు ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చలో భాగంగా ఇరువురు పరస్పరం వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. కొన్ని సందర్భాల్లో ఉభయులు సంయమనం కోల్పోయారు. ‘నోరు మూసెయ్’ అంటూ బైడెన్‌పై ట్రంప్ విరుచుకుపడగా.. ‘మొరటువాడివి’ అంటూ ట్రంప్‌పై బైడెన్ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఇలా చర్చ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. పలు అంశాలపై ఇరువురి వైఖరేంటో వినే అవకాశం ప్రజలకు కలిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.