
ఈ వారంలోనే ఫైజర్ టీకాకు అనుమతి?
లండన్: కరోనాను అరికట్టేందుకు ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తగా తయారుచేస్తున్న వ్యాక్సిన్ వినియోగానికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఈవారంలోనే అనుమతులిచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ పత్రిక ఆదివారం ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. డిసెంబరు 1 నాటికే ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉండాలని ‘నేషనల్ హెల్త్ సర్వీస్’(ఎన్హెచ్ఎస్)ను అక్కడి ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
యూకేలో ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు అక్కడి ఆరోగ్య శాఖ ఆదివారం స్పందించలేదు. కానీ, టీకాను వీలైనంత వేగంగా ప్రజలకు అందించేందుకు హెల్త్ సర్వీస్ ఏర్పాట్లన్నీ చేసుకొని సర్వసన్నద్ధంగా ఉందని ఓ అధికార ప్రతినిధి తెలిపారు. టీకాకు అనుమతిచ్చేందుకు మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) ఎంత సమయమైనా తీసుకోవచ్చని తెలిపారు. ఎంహెచ్ఆర్ఏ ప్రభుత్వంతో సంబంధం లేని ఒక స్వతంత్ర సంస్థ అని పేర్కొన్నారు. గత వారమే బ్రిటన్ ప్రభుత్వం ఎంహెచ్ఆర్ఏను ఫైజర్ టీకా సామర్థ్యాన్ని పరీక్షించాలని విజ్ఞప్తి చేసింది.
బ్రిటన్ ఇప్పటికే 40 మిలియన్ల డోసులు ఆర్డర్ చేసింది. వీటిలో 10 మిలియన్లు ఈ ఏడాది చివరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అనుమతులు లభించి, అన్నీ సజావుగా సాగితే డిసెంబరు ముగిసే నాటికి బ్రిటన్‌లో ఐదు కోట్ల మందికి టీకా అందే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అత్యవవర వినియోగం కోసం అనుమతులివ్వాలంటూ ఇటీవల అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ)కు ఫైజర్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎఫ్‌డీఏ డిసెంబరు 10న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.