Updated : 27/10/2020 15:08 IST

ఈసారి తెలుగువాళ్ల ఓట్లూ కీలకమే

బైడెన్‌ ముందున్నా... ఖాయమేమీ కాదు

 ఈటీవీ భారత్‌ ముఖాముఖిలో తానా అధ్యక్షుడు జైశేఖర్‌ తాళ్లూరి

‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు సర్వేలలో డెమోక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉన్నా అసలు పోరులో ఏమైనా జరగొచ్చు! రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ పార్టీలకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మార్పు ఉండదు. కానీ పోరు హోరాహోరీగా జరిగే తటస్థ రాష్ట్రాలే అధ్యక్ష ఎన్నికను నిర్దేశిస్తాయి’’ అని ప్రవాస భారతీయుడు, తానా (ఉత్తర అమెరికా తెలుగు సమాఖ్య) అధ్యక్షుడు జైశేఖర్‌ తాళ్లూరి అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కీలక పాత్ర పోషించనున్నారని ఆయన అంచనా వేశారు. పోరు తీవ్రంగా జరిగే రాష్ట్రాల్లో కూడా మన వాళ్ల ఓట్లే కీలకం కానున్నాయని అంటున్నారు. అగ్రరాజ్యపు అధ్యక్షుడిని ఎన్నికోవడానికి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నవంబర్‌ 3వ తేదీ నాటికి పోలింగ్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జైశేఖర్‌తో ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ముఖాముఖి.... ముఖ్యాంశాలు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతోంది?

ఇప్పటికే ఇక్కడి పౌరులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఎన్నికలంటే.. భారత్‌లో ఉన్నంత ఆసక్తి అమెరికాలో ఉండదు. పోలింగ్‌ కూడా ఎప్పుడూ 55 శాతం దాటదు. చాలామంది స్థానికులకు వారి కాంగ్రెస్‌ సభ్యులు, సెనేటర్లు ఎవరో కూడా తెలీదు. భారత్‌లో మాదిరిగా మొత్తం ఎన్నికల ప్రక్రియపై అంత ఆసక్తి ఉండదిక్కడి ప్రజల్లో! ప్రస్తుతానికి డెమోక్రాట్లకు మొగ్గు ఎక్కువగా ఉంది.


2016లోనూ ఎన్నికలకు ముందు పరిస్థితి డెమోక్రాట్లకు (హిల్లరీ క్లింటన్‌కు) అనుకూలంగా కనిపించింది. కానీ ఫలితాలు వేరుగా వచ్చాయి. మరీసారి ఎలా ఉంటుందని మీ అంచనా?

సబర్బన్‌ మామ్స్‌ ( నగరాల బయట ఉండి ఉద్యోగాలు చేసుకునే మహిళలు) ఓట్లు కూడా హిల్లరీకి వస్తాయి అని అంచనా వేశారు. కానీ ఏ కారణం వల్లనో అలా జరగలేదు. ట్రంప్‌ సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. వ్యాపారవేత్త. అదే అతనికి కలిసొచ్చింది. ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందు సర్వేల్లో బైడెన్‌ ముందంజలో ఉన్నా పోరు ఆసక్తికరంగానే ఉంది. చివరికి ఏం జరుగుతుందో చెప్పలేం. మధ్య పశ్చిమ (మిడిల్‌ వెస్ట్‌) రాష్ట్రాలు.. వీటిని రెడ్‌ స్టేట్స్‌ అంటారు. ఇక్కడ ఎప్పుడూ రిపబ్లికన్లకు అనుకూలంగానే ఉంటుంది. వలసదారులుండే కోస్తా రాష్ట్రాల్లో మాత్రం డెమోక్రాట్లకు మద్దతుంటుంది. పోరు తీవ్రంగా ఉండే తటస్థ రాష్ట్రాలే ఫలితాలను నిర్ణయిస్తాయి. ఓహాయో, పెన్సిల్వేనియా, మిషీగన్, కొలరాడో, నెవడా, నార్త్‌ కరోలినా ముఖ్యమైనవి. ఈ రాష్ట్రాల్లో బైడెన్‌ 5-6శాతం ముందంజలో ఉన్నారు.

భారత్‌-అమెరికా సంబంధాల పరంగా ఎవరు గెలిస్తే మనకు అనుకూలం?

ఎవరు గెలిచినా భారత్‌ తో సంబంధాలు బాగానే ఉంటాయి. కాకపోతే ట్రంప్‌ మాత్రం భారత్‌కు చాలా అనుకూలంగా ఉన్నారు. వాణిజ్య వ్యవహారాల్లో  చైనాను ఒంటరి చేయాలన్న ఆలోచనతో ట్రంప్‌ ఉన్నారు కాబట్టి.. ఆ కోణంలో భారత్‌కు ఉపయోగపడుతుందనేది నా అంచనా! బీ-1 వీసాల విషయాన్ని పక్కనపెడితే రిపబ్లికన్లు గెలిస్తే.. మనకు కొంత లాభం ఉంటుంది. ఒకవేళ బీ-1 వీసాలు తగ్గినా అది పరోక్షంగా మన దేశానికే లాభిస్తుంది. ఎందుకంటే అమెరికాలో చేయాల్సిన ఆ పని అంతా కూడా అవుట్‌ సోర్సింగ్‌ రూపంలో భారత్‌ కే వస్తుంది. కాబట్టి వీసాలగురించి ఆందోళన అవసరం లేదు. ఫెÆయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్‌ ఇమిగ్రెంట్స్‌ అనే బిల్లు ఉంది. నెంబర్‌ 386 అని పిలిచే ఈ బిల్లును ఆమోదిస్తామని రెండు పార్టీలూ చెబుతున్నాయి. అది ఆమోదం పొందితే మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు ఉపయోగంగా ఉంటుంది.

ట్రంప్‌ గెలిస్తే.. ఏ అంశాల వల్ల గెలుస్తారు? ఓడితే.... ఎందుకు ఓడిపోవచ్చు?

ట్రంప్‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ బాగుంది. కొవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంది. ఇవన్నీ ఆయనకు సానుకూలాంశాలు. అంతర్గత భద్రత విషయంలో ట్రంప్‌ పాలన బాగుందనే అభిప్రాయం ఉంది. బ్లాక్‌ లైఫ్‌ మాటర్స్‌ వంటి ఉద్యమం జరిగినప్పటికీ..  భద్రత విషయంలో ఆందోళనలు లేవు. విదేశాంగ విధానంలోనూ ట్రంప్‌కు సానుకూలత ఉంది. క్రిమినల్‌ జస్టిస్‌ సంస్కరణలు వంటివి కూడా సానుకూలంగా ఉన్నాయి. ఒకప్పుడు నల్లవారి దగ్గర డ్రగ్స్‌ ఉంటే వెంటనే జైలులో పెట్టేవారు. అది మార్చారు. అలాగే నల్లవారి కోసం యునైటెడ్‌ నీగ్రో కాలేజ్‌ ఫండింగ్‌ అని చాలా పెద్ద కార్యక్రమం తీసుకొచ్చారు. వారికి ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇక ఎందుకు ఓడతారు అంటే.. నా ఉద్దేశంలో కరోనా విషయంలో వ్యవహరించిన తీరు ఒక కారణం! కొవిడ్‌ను మొదట్లో చాలా తేలికగా తీసుకున్నారు అనే భావన ఉంది. మీడియా పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అలాగే నల్లజాతీయుల ఉద్యమం కొంత వ్యతిరేకత తీసుకురావచ్చు. అనూహ్యంగా ఉండే ఆయన వ్యవహారశైలి, పద్ధతి, గౌరవం లేకుండా వ్యవహరించే విధానం కొంతమందికి నచ్చక పోవచ్చు. అధ్యక్షుడిగా ఆయన అంగీకార యోగ్యత కూడా సర్వేల్లో పడిపోయింది.

ఈ ఎన్నికల్లో మన ప్రవాస భారతీయుల ప్రభావమెంత?

కచ్చితంగా చాలా వరకూ ఉంటుంది. పోరు తీవ్రంగా ఉండే రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, వర్జీనియా, ఒహాయో ఇలాంటి చోట్ల భారతీయులు.. ముఖ్యంగా మన తెలుగువాళ్ల ఓట్లు ఇక్కడ ఎక్కువుగా ఉన్నాయి. వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అమెరికాలో అత్యధికంగా వృద్ధి చెందుతున్న విదేశీ భాష తెలుగు. దాదాపు 13లక్షల మంది తెలుగువాళ్లు అమెరికాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ మధ్య జారీ చేసిన గ్రీన్‌ కార్డుల్లో 5 లక్షల్లో... 3లక్షల 50వేలు తెలుగువాళ్లవే! అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌లోనూ మన తెలుగు భాష చేరింది. తెలుగు వారి ప్రాముఖ్యత అన్ని చోట్లా కనిపిస్తోంది. కొంత మంది ఉన్నత వ్యాపార వర్గాల వారు రాజకీయాల్లో కొంచెం కీలకంగానే ఉంటున్నారు. ఇన్నాళ్లు తెలుగువాళ్లు రాజకీయాల్లో పాలుపంచుకోలేదు. కానీ.. కొత్తతరం రాజకీయాల్లో చొరవ చూపుతోంది. 
 

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని