
చైనా చేసింది ఎన్నటికీ మర్చిపోం: ట్రంప్
ఫయెట్టివిల్లే: కరోనా విషయంలో చైనా చేసిన పనిని అమెరికా ఎన్నటికీ మర్చిపోదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో డ్రాగన్ విఫలమైందని, దాని వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చైనాపై మరోసారి నిప్పులు చెరిగారు. జార్జియా, ఉత్తర కరోలినాలో ట్రంప్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై కూడా విమర్శల వర్షం కురిపించారు.
‘ఏడు నెలల క్రితం అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. దేశ చరిత్రలోనే గొప్ప స్థితికి చేరుకుంది. అలాంటి సమయంలో చైనా నుంచి వచ్చిన వైరస్ మనల్ని దెబ్బతీసింది. ఎంతోమంది అమెరికన్ల ప్రాణాలు తీసింది. ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేసింది. చైనా చేసిన పనిని అమెరికా ఎన్నటికీ మర్చిపోదు’ అని ట్రంప్ డ్రాగన్‌ను దుయ్యబట్టారు. డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బైడెన్.. చైనా పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని బీజింగ్ కోరుకుంటోందన్నారు. బైడెన్ బలహీనమైన వ్యక్తి అని మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో చైనా విఫలమైంది. తమ దేశంలోనే నియంత్రించకుండా ప్రపంచం మీదకు వదిలేశారు. ఇప్పుడు కరోనా కారణంగా చాలా మంది బలవంతంగా మాస్క్‌లు పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది ప్రపంచానికి చైనా చేసిన పని’ అని ట్రంప్ మండిపడ్డారు.
అమెరికాలో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. నెలక్రితం వరకు పరిస్థితులు సాధారణంగా ఉండగా.. రెండు వారాల నుంచి మళ్లీ రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం వైరస్ నుంచి కోలుకుంటున్నామని చెబుతూ రావడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో వైరస్ నియంత్రణ ప్రధాన అంశంగా మారింది. మరి తాజా పరిస్థితులు ట్రంప్‌ను గట్టెక్కిస్తాయో లేదో చూడాలి..!
Advertisement