Published : 08/11/2020 19:33 IST

బైడెన్‌ గెలుపుపై.. ప్రపంచ నేతలు..!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. అమెరికాతో అన్ని దేశాలకు విదేశీ విధానం కీలకం కావడంతో ఫలితాలపై ఆచితూచి స్పందించాయి. చివరకు, నాలుగు రోజుల అనంతరం బైడెన్‌ గెలిచినట్లు వెల్లడికాగానే ఆయనకు వివిధ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్‌, డెలావెర్‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ప్రసంగించారు. ట్రంప్‌ అనుసరించిన విదేశాంగ విధానంలో మార్పులు చేసే ప్రయత్నంలో ఉన్న బైడెన్‌, తన ఎన్నికపై అంతర్జాతీయ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం అమెరికా వైపు చూస్తోందన్న బైడెన్‌, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థానంలో అమెరికా కొనసాగుతుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. బైడెన్‌ ప్రసంగం అనంతరం వివిధ దేశాధినేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆస్ట్రేలియా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్‌, కమలా హారిస్‌లను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ అభినందించారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడంలో బైడెన్‌-హారిస్‌ ద్వయంతో కలిసి పనిచేస్తామని మారిసన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. చైనా-ఆస్ట్రేలియా దేశాల మధ్య గత కొంతకాలంగా క్షీణిస్తోన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికాకు మద్దతిస్తున్నందుకు ఆస్ట్రేలియా తగిన మూల్యం చెల్లిస్తుందని ఈ మధ్యే చైనీస్‌ మీడియా హెచ్చరించింది.

కెనడా..
ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్‌-హారిస్‌లకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా అభినందనలు తెలిపారు. కెనడా-అమెరికా మధ్య ఇప్పటికే బలంగా ఉన్న సంబంధాలు మరింత ధృడపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మరింత శాంతిని నెలకొల్పడంతోపాటు, కొవిడ్‌పై పోరు, ఆర్థిక ప్రగతిపై కలిసి పనిచేయడంలో ఈ మద్దతు మరింత దోహదపడుతుందని ట్రూడో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఇరుదేశాల ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను విధించడంతో ట్రంప్‌-కెనడా ప్రధాని మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే బైడెన్‌ గెలుపు అనంతరం, ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని కెనడా భావిస్తోంది. ఇదివరకు బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ కెనడాతో సానుకూల సంబంధాలను కొనసాగించారు.

యూరోపియన్‌ యూనియన్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌, హారిస్‌లను యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షులు ఉర్సులా ఫోన్‌ డేర్‌ లేయెన్‌ అభినందించారు. సాధ్యమైనంత తొందరగా వారిని కలిసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఉర్సులా ఫోన్‌ డేర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం మారుతున్న సమయంలో సవాళ్లు ఎదురవడంతో పాటే అవకాశాలు ఉంటాయి. వీటిని అధిగమిస్తూ అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఈ నేపథ్యంలో మరోసారి మన భాగస్వామ్యానికి ప్రాముఖ్యత ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌..
బైడెన్‌, హారిస్‌లు ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటన రాగానే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూయేల్‌ మెక్రాన్‌ వారిని అభినందించారు. ‘ప్రస్తుతం ఎదురౌతున్న సవాళ్లను అధిగమించడంలో మనం ఎంతో కృషిచేయాలి. దీనిపై కలిసి పనిచేద్దాం’ అని మెక్రాన్‌ వెల్లడించారు. అంతకు ముందు ట్రంప్‌ అధ్యక్ష పాలనలో అమెరికా నాయకత్వాన్ని మెక్రాన్‌ విమర్శించిన విషయం తెలిసిందే.

భారత్‌..
అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారని జో బైడెన్‌ ను భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గతంలో అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో బైడెన్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కమలా హారిస్‌ విజయం భారత అమెరికన్లందరికీ గర్వకారణమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

బ్రిటన్‌..
అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ ఎన్నిక కావడం పట్ల బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆయనకు అభినందనలు తెలిపారు. వాణిజ్యం, పర్యావరణ మార్పు, భద్రత వంటి విషయాల్లో అమెరికాతో భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు.

జర్మనీ..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, హారిస్‌లను జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్ అభినందించారు. బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు జర్మనీ సిద్ధంగా ఉన్నట్లు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. తొలి మహిళా జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ కావడం విశేషం. జర్మనీ విషయంలోనూ ట్రంప్ కాస్త దూరంగానే ఉండేవారు. ముఖ్యంగా రష్యా నియంత్రణలో జర్మనీ ఉన్నట్లు ట్రంప్‌ ఆరోపించేవారు.

చైనా..
చైనా అధ్యక్షుడు మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అక్కడి అధికారిక మీడియా మాత్రం బైడెన్‌ గెలుపుతో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లు అభిప్రాయపడింది.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని