Published : 07 May 2021 17:22 IST

Corona Crisis: భారత్‌కు ఏఏపీఐ చేయూత! 

వాషింగ్టన్‌: కరోనా సెకండ్‌ వేవ్‌తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశానికి ప్రవాస భారతీయ వైద్యులు తమవంతు సహకారం అందించేందుకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా భారత్‌ అవసరాలను తెలుసుకొనేందుకు వీలుగా మంత్రిత్వశాఖలతో పాటు అమెరికా అధికారులతో సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్ ఇండియన్‌ ఆరిజన్‌ (ఏఏపీఐ) ప్రతినిధులు వెల్లడించారు. అలాగే, కొవిడ్ రోగులకు ఆన్‌లైన్‌ టెలీకన్సల్టేషన్లు అందిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు 1000 యూనిట్ల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపించి సేవా ఇంటర్నేషనల్‌ ద్వారా పంపిణీ చేయనున్నట్టు వివరించారు. 

వారంలోపే రెండు మిలియన్‌ డాలర్ల సమీకరణ

ఈ క్లిష్టసమయంలో భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు వారం రోజుల్లోపు దాదాపు రెండు మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించినట్టు డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డ వెల్లడించారు. ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సేకరించి.. వాటిని యూపీఎస్‌ద్వారా పంపించి సేవా ఇంటర్నేషనల్‌ ద్వారా పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌ ముడి పదార్థాలు, ఔషధాలు, పీపీఈ కిట్లు తదితరాలను భారత్‌కు అందించాలని బైడెన్‌ ప్రభుత్వానికి డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డ విజ్ఞప్తి చేశారు. వచ్చేవారంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారీస్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులను వాషింగ్టన్‌ డీసీలో ఏఏపీఐ ప్రతినిధి బృందం కలుస్తుందన్నారు. 

భారత్‌లో లాక్‌డౌన్‌ విధించాలి!

ఆక్సిజెనటర్‌, వెంటిలేటర్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు, తదితర సామగ్రిని భారత్‌కు సరఫరా చేయడంపై దృష్టిపెట్టాల్సిన కీలక సమయం ఇదేనన్నారు. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఏఏపీఐ కోరుతుందని డాక్టర్‌ సుధాకర్‌ జొన్నలగడ్డ తెలిపారు. తాము పంపించే సామగ్రిని తొలుత ఐసోలేటెడ్‌ ప్రాంతాల్లో, ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 

యూఎస్‌లో టీకా.. భారత్‌కు ఇవ్వాలని అడుగుతాం
వేలాది మంది ఇండో అమెరికన్‌ వైద్యులు సాయం చేయాలనే సంకల్పంతో ఉన్నారని, కానీ ఎలాంటి అడ్డంకులు ఉండకుండా కొన్ని క్లియరెన్స్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగితే తాము పెద్ద ప్రభావమే చూపగలుగుతామని డాక్టర్‌ కొల్లి అన్నారు. అమెరికాలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ నిల్వలు భారగా ఉన్నాయని.. వాటిని భారత్‌కు తరలించవచ్చని తెలిపారు. ఇందుకోసం అమెరికా రాజకీయ నాయకులను కోరనున్నట్టు డాక్టర్‌ కొల్లి తెలిపారు. 

టీకా వేసుకోండి.. మాస్క్‌ వదలొద్దు!

ఈ సంక్షోభం ఇక్కడితో అయిపోలేదని, వైరస్‌ మ్యుటెంట్‌ చెందుతున్నందున ప్రతిఒక్కరూ సీడీసీ మార్గదర్శకాలను పాటించి టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీకా వేయించుకోని 16 ఏళ్ల లోపు వయసు వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు టీకాలు వేయించుకోవడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్‌ చేయడం ఎంతో అవసరమన్నారు. వ్యాధి సోకిన తర్వాత నయం చేయడంపై దృష్టిపెట్టడం కన్నా రాకుండా అడ్డుకోవడంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని డాక్టర్‌ జొన్నలగడ్డ గుర్తు చేశారు. టీకాలు వేయించుకోవడం, మాస్క్‌లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఏఏపీఐ సభ్యుల సేవలను ఆయన ప్రశంసించారు. ఏఏపీఐలో సభ్యులు కానివారు సైతం తమ పట్ల నమ్మకంతో సహకారం అందిస్తున్నందుకు గర్వంగా ఉందని డాక్టర్‌ కతులా అన్నారు. భారత్‌లోని వైద్యులు, రోగులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వ్యాక్సిన్లలో వైరస్‌ బతికి ఉండదని, ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. 

యూఎస్‌లో మన వైద్యులే కీలకం

అమెరికాలో ప్రతి ఆరుగురు కొవిడ్ రోగుల్లో ఒకరికి భారతీయ వైద్యులే చికిత్స అందిస్తున్నారని డాక్టర్‌ గంగసాని తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందించడంలో గత ఏడాదిగా ఏఏపీఐ ఫిజీషియన్లు ముందువరుసలో ఉన్నారని చెప్పారు. ఒక్కొక్కరి అనుభవాలు, అభిప్రాయాలను పంచుకొనేందుకు వెబినార్‌లు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఏఏపీఐ కృషిని అభినందించారు. మూడు టెలీ హెల్త్ ప్లాట్‌ఫాంలతో కలిసి పనిచేస్తున్నామని, మానవతా దృక్పథంతో ఫిజీషియన్లు భారత్‌లో ఉన్న రోగులకు http://Mdtok.com/dr/Covid,  www.eGlobalDoctors.com ద్వారా టెలీ కన్సల్టింగ్‌ సేవలందించనున్నట్టు తెలిపారు. అవసరాన్ని బట్టి కరోనా రోగుల కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వైద్యులు రోజంతా అందుబాటులో ఉంటారని తెలిపారు. అనవసరంగా ఆందోళనపడి ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 11గంటల వరకు టెలీకన్సల్టేషన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆయా దేశాల్లో వేర్వేరు ప్రోటాకాల్స్‌, లైసెన్సింగ్‌ ఇబ్బందులు ఉన్నందున వీటిపైనా ఆరోగ్యమంత్రితో మాట్లాడాలని యోచిస్తున్నట్టు డాక్టర్‌ గంగసాని తెలిపారు. 

జులై 2నుంచి ఏఏపీఐ కన్వెన్షన్‌

ఏఏపీఐ 39వ కన్వెన్షన్‌ జూలై 2నుంచి 5 వరకు అట్లాంటాలోని ఓమ్నిలో నిర్వహించనున్నట్టు డాక్టర్‌ గంగసాని వెల్లడించారు. సీడీసీ జారీ చేసిన అన్ని నిబంధనలను పాటిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని, టీకా తీసుకోకపోవడానికి కారణాలేమీ ఉండవని డాక్టర్‌ మెహతా అన్నారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో తాను చేసిన సేవలను గుర్తుచేశారు. ఛార్లెట్‌లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు, భారత్‌లో పలు ఆస్పత్రులకు అందించిన సహకారాన్ని వివరించారు. కొవిడ్‌ మరణాలు పెరుగుతుండటంతో దహనాలకు సవాళ్లు ఎదురవుతుండటంతో ఎలక్ట్రిక్‌ దహనవాటికల కోసం సాయం చేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా తాను 150 మాస్క్‌లను కూడా తయారుచేశానన్నారు. మానసిక ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ ప్రభుదేవా చర్చను ప్రారంభించారు. ఆరోగ్య సమస్యల పట్ల తెలివిగా వ్యవహరించడం, తగినంత విశ్రాంతి పొందడం చాలా అవసరమన్నారు. 

భారత్‌కు నిధుల కోసం కృషి

భారత్‌కు మద్దతుగా నిధులు సమకూర్చడంలో ఏఏపీఐ తన కృషిని కొనసాగిస్తుందని ఏఏపీఐ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సాయం చేయాలనుకొనే దాతలు aapiusa.orgని సంప్రదించాలని కోరారు. భారత్‌లో ఈ వారం 4లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, 10 రోజుల వ్యవధిలోనే (ఏప్రిల్‌ 19 నుంచి 29వరకు) మరణాలు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ప్రతి సాయం సముద్రంలో నీటిబొట్టంతే అయినప్పటికీ.. చిన్నచిన్న నీటి బింధువులే ఓ మహా సముద్రమవుతుందని డాక్టర్‌ కతువా అన్నారు. ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని, మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు సీడీసీ జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఫిజిషియన్లు కోరారు. 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts