అమరావతి రైతుల పాదయాత్రకు మేము సైతం అంటున్న ప్రవాసులు

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ, రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. రైతులకు మద్దతుగా ప్రవాసులు ముందుకు వస్తున్నారు. 

Updated : 22 Sep 2022 06:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ, రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. పాదయాత్ర తొమ్మిదో రోజు బాపట్ల జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. రైతుల పాదయాత్రకు కృష్ణా డెల్టా ప్రజానీకం ఆత్మీయ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా రైతులు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని చెంత పూజలు చేసి అమరావతిని ఆశీర్వదించాలని మొక్కుకున్నారు. కాగా పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా దేశ, విదేశాల్లోని తెలుగు వారు సైతం అమరావతి రాజధానికి మద్దతుగా ముందుకు వస్తున్నారు. రైతులు చేస్తున్న అలుపెరుగని రాజధాని పోరులో మేము సైతం అంటూ నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా పాదం కదుపుతున్నారు. వారితో కలసి సంఘీభావంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ దమన నీతిని వారు ఎండగడుతున్నారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయినా రాజధాని లేకపోవడాన్ని ప్రవాసులు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. 

ఎన్నారైల మద్దతు..

అమరావతి రైతుల పాదయాత్రకు అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు పెద్దఎత్తున మద్దతు పలికారు. ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి మరీ రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. రైతుల పాదయాత్రకు అడుగులు కలిపి మీమున్నామంటూ వారితో కలిసి సాగుతున్నారు. వీరిలో వాషింగ్టన్‌ డీసీ నుంచి జానకిరామ్‌ బోగనేని రాగా, బే ఏరియా నుంచి శ్రీనివాస్‌ వల్లూరుపల్లి వచ్చి రైతులతో కలిసి ముందుకు సాగారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దారుణమని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. రైతులకు తాము అండగా ఉండటామని హమీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని