ప్రముఖ అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ ధనరాజ్‌ కన్నుమూత

ప్రముఖ అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ ధనరాజ్‌ కన్నుమూశారు. అమెరికా, భారత్‌లో వైద్యరంగంలో సేవలందించిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.

Updated : 17 Feb 2023 15:18 IST

కాలిఫోర్నియా: ప్రముఖ అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ ధనరాజ్‌(91) ఇకలేరు. ఫిబ్రవరి 15న ఆయన అమెరికాలో కన్నుమూశారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఎంతో కష్టపడి చదివి అంచెలంచెలుగా ఎదిగి రాజమహేంద్రవరం నుంచి అమెరికా దాకా ఎంతోమందికి వైద్య సేవలందించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనస్తీషియా విభాగంలో 500 మందికి పైగా డీఏ, ఎండీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి  వైద్యరంగంలో తనదైన ముద్రవేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంగా ఉండే ఆయన స్వభావం ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఆరు నెలల క్రితం వరకు ఎంతో క్రియాశీలంగా ఉండే ధనరాజ్‌.. హెపాటిక్‌ కోమాతో బాధపడుతూ బుధవారం కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. 

1956లో ఆంధ్రప్రదేశ్‌లో అనస్తీషియాలో డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఎండీ) అందుకున్న మూడో వ్యక్తి ఆయనే కావడం విశేషం. ఆ తర్వాత ఆయన 1975లో ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనస్తీషియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. అంతర్జాతీయ వైద్య జర్నల్స్‌లో ఆయన రివ్యూలు 40కి పైగా ప్రచురితమయ్యాయి. ఆంధ్రా వైద్య కళాశాలలో చాలా కాలం పాటు పని చేసిన ధనరాజ్‌.. అనస్తీషియా విభాగంపై ఉన్న ఆసక్తితో తన పేరిట ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికా అప్పటి అధ్యక్షుడు కెన్నడీ 1961లో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్‌కు ఆహ్వానించిన అతికొద్ది మంది వైద్యుల్లో ధనరాజ్‌ కూడా ఉన్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి తిరిగి భారత్‌కు చేరుకున్న ఆయన ఆంధ్రా వైద్య కళాశాలలో అనేకమందికి శిక్షణ ఇచ్చారు. మన దేశంలోని ప్రభుత్వ, కార్పొరేట్‌ వైద్యరంగాల్లో విశేష సేవలందించారు.

1956లో జీజీహెచ్‌లో చీఫ్‌ అనస్తీషియన్‌గా తొలి పోస్టింగ్ పొందిన డాక్టర్‌ ధనరాజ్‌.. ఆ తర్వాత 1960 నుంచి 61వరకు అమెరికాలో శిక్షణ పొందారు. 1977 నుంచి 1980 వరకు గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో చీఫ్‌ అనస్తీషియిస్ట్‌గా పనిచేశారు. 1979-80 మధ్య కాలంలో గుంటూరు మెన్స్‌ హాస్టల్‌ ఇన్‌ఛార్జి వార్డెన్‌గా‌, ఫ్యాకల్టీ స్పోర్ట్స్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ఆ తర్వాత 1980-83 వరకు ఐయోవాలో పనిచేశారు. 1984లో తిరుపతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్నారు. 1988-89 మధ్య కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, డీఎంఈగానూ సేవలందించారు. 1989-96 మధ్య కాలంలో ఐయోవాలోని ఆరిజన్‌ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో పనిచేశారు. అనేక వైద్య కళాశాలల్లో పనిచేసిన ఆయన.. దాదాపు 500 మందికి పైగా డీఏ, ఎండీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని