Canada: కెనడాలో కనుల విందుగా అన్నమయ్య ఆరాధనోత్సవాలు

తెలుగుతల్లి కెనడా సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మి రాయవరపు బృందం ఆధ్వర్యంలో అన్నమయ్య ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత తెలుగు సినిమా కథ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, యస్.పి. వసంతలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Published : 23 May 2023 16:48 IST

ఒట్టోవా: 'వీధుల వీధుల విభుడేగే' అనే అన్నమయ్య కృతిలో ఉన్నట్టు  108 విలక్షణమైన అన్నమయ్య కృతులతో 11 గంటల పాటు అన్నమయ్య ఆరాధనోత్సవాలు కెనడాలో ఘనంగా జరిగాయి. ఆరు ప్రావిన్స్‌ల నుంచి తెలుగువారు ఇందులో పాల్గొన్నారు.  తెలుగుతల్లి కెనడా సంస్థ వ్యవస్థాపకురాలు లక్ష్మి రాయవరపు బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత తెలుగు సినిమా కథ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, యస్.పి. వసంతలక్ష్మి ముఖ్య అతిథులుగా ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. ఉమా సలాది దీపప్రజ్వలన చేయగా పాణంగిపల్లి విజయలక్ష్మి ప్రార్థన గీతంతో సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి సందర్భంలోనూ అతి చిన్న పదాలతో జనాల నాల్కల మీద తిరిగే రచనలు రాసిన అన్నమయ్య  తనలాంటి ఎందరో రచయితలకి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. అన్నమయ్య పుట్టిన తిథి లోనే తను కూడా పుట్టానని తెలియజేస్తూ, అన్నమయ్య గురించి చేసిన ప్రసంగంలో ఎన్నో  ఆసక్తి కరమైన విషయాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ ద్వారా తెలుగుతల్లి కెనడా భావి తరాలకు మంచి సంస్కృతి, సంస్కారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.  ఈ సందర్భంగా తెలుగుతల్లి కెనడా తరఫున అశోక్‌ తేజ భార్య.. ఆయనకు పురస్కారాన్ని అందించారు.

అనంతరం యస్.పి. వసంతలక్ష్మి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విదేశాలకు రాలేదని, కెనడా ఆన్‌లైన్‌లో పాల్గొన్నప్పటికీ.. కెనడా వచ్చిన అనుభూతి కలిగిందని అన్నారు. చక్కని ఆత్మీయమైన మాటలతో, పాటతో ఆమె అందర్నీ అలరించారు. తెలుగుతల్లి కెనడా లక్ష్మి రాయవరపు గారు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలుగు భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి ఇతిహాసాలు ఉన్నాయి. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని కీర్తిస్తూ ఆయన 32 వేలకు పైగా కీర్తనలు రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాల్లో భక్తి, సాహిత్యం, పెనవేసికొని ఉంటాయి.’’ అని అన్నారు.

తెలుగు భాషకి అత్యున్నత వైభవం తెచ్చిన అన్నమయ్య కృతులను దేశ విదేశాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న తెలుగుతల్లి కెనడా సంస్థకు సహకరిస్తున్న పత్రిక కమిటీని, వివాహ వేదిక కమిటీని, యూట్యూబ్ కమిటీని, పిల్లల మాసపత్రిక ‘గడుగ్గాయి’ కమిటీని అభినందించారు. త్యాగరాజ ఉత్సవాల్లో గుర్తింపు పొందిన ఒక సీనియర్ గాయని/ గాయకునికి జీవన సాఫల్య పురస్కారం అందించడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నామని తెలుగుతల్లి కెనడా నిర్వాహకులు పేర్కొన్నారు. తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రికతో పాటు ప్రతినెలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలో ఉన్న ప్రతిభావంతులైన వారందరినీ ఒక చోట చేర్చడం తన లక్ష్యమని లక్ష్మి రాయవరపు తెలిపారు. అతిథులకు భాస్కర వర్మ వందన సమర్పణతో  మొదటి సభ ముగిసి, 10 గంటల పాటు 108 విలక్షణమైన అన్నమయ్య కీర్తనలు 4 నృత్యాలు, వీణా వాదనలతో కెనడా ప్రతిభ చూపరులను కదలకుండా కట్టి పడేసింది.భారత్‌, కెనడా, అమెరికా దేశాల నుంచి పలువురు ప్రముఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు