
ఒక అడుగు వెనక్కి తగ్గిన ఆస్ట్రేలియా..!
ఇంటర్నెట్డెస్క్: భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధంలో స్వల్ప సడలింపు లభించింది. గతంలో భారత్ నుంచి విమానాల రాకపోకలను మే15 వరకు నిషేధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఒకవేళ ఎవరైనా వస్తే జైలుశిక్ష, జరిమానా తప్పదని ప్రధాని స్కాట్ మారిసన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన నిర్ణయంపై కొంచెం వెనక్కి తగ్గారు. భారత్లో చిక్కుకుపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని స్కాట్ మారిసన్ శుక్రవారం ఉదయం వెల్లడించారు. వచ్చేవారంతో ఈ నిషేధం ముగిశాక.. భారత్లో చిక్కుకున్న వారు తిరిగి వచ్చేలా విమానాలు నడిపే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. భారత్లో మొత్తం 9,000 మంది ఆస్ట్రేలియాన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 900 మంది స్వదేశానికి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకొన్నారు.
ముందు ఎవరు..?
మే నెల మధ్య నుంచి భారత్కు విమానాలు నడిపే అవకాశం ఉందని మారిసన్ వెల్లడించారు. ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్న ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తరలిస్తారు. తొలుత ఆస్ట్రేలియా నిషేధం విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్లో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అత్యవసరంగా స్వదేశానికి వెళ్లాల్సిన ఆస్ట్రేలియన్ల సంఖ్య 600 నుంచి 900 చేరినట్లు సమాచారం.
ఇప్పటికే భారత్ నుంచి వచ్చే వారిని క్వారెంటైన్ చేయించేందుకు ది హోవర్డ్ స్ప్రింగ్ క్వారెంటైన్ కేంద్రాన్ని వచ్చేవారానికి 2,000 పడకలతో విస్తరించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.