రాధిక మంగిపూడి ‘భారతీయ తత్త్వ శతకము’ ఆవిష్కరణ

ప్రముఖ రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన ‘భారతీయ తత్త్వ శతకము’(తటవర్తి గురుకులం ఆస్ట్రేలియా వారి ప్రచురణ) ప్రముఖ అవధానులు డాక్టర్ మేడసాని మోహన్ ఆవిష్కరించారు. ‘

Updated : 07 Dec 2022 17:06 IST

సింగపూర్‌: ప్రముఖ రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన ‘భారతీయ తత్త్వ శతకము’(తటవర్తి గురుకులం ఆస్ట్రేలియా వారి ప్రచురణ) పుస్తకాన్ని ప్రముఖ అవధానులు డాక్టర్ మేడసాని మోహన్ ఆవిష్కరించారు. ‘సింగపూర్ తెలుగు టీవీ’ సాంకేతిక నిర్వహణలో అంతర్జాలం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ వీడియో సందేశం ద్వారా ఆశీస్సులు అందించగా,  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ సినీకవి రచయిత భువనచంద్ర, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి గౌరవ అతిథులుగా పాల్గొని ఈ పుస్తక విశిష్టతను కొనియాడారు.

ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేసిన డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ ‘మధువచోరుడీ రాధికా మంగిపూడి’ అంటూ ఆశువుగా పద్య రూపంలో ఆమెకు ఆశీస్సులు అందించారు. తొలి పుస్తక ప్రతిని విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి చరణాలకు అర్పించి అంతర్జాలంలోనే అందరికీ అమ్మవారి దర్శనం కల్పించారు.

తమ గురుకులం నిర్వహిస్తున్న ‘కావ్య గురుదక్షిణ’ కార్యక్రమ పరంపరలో భాగంగా, రాధిక ఈ శతకాన్ని తాను చదువుకున్న విజయనగరం విద్యాసంస్థలకు, చిన్ననాటి గురువులకు అంకితం చేయడం, ఆ గురువుల సమక్షంలోనే ఈ ఆవిష్కరణ చేయడం ఎంతో ప్రశంసనీయమని ‘తటవర్తి గురుకులం’ అధ్యక్షులు తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు.

శతక కవయిత్రి రాధిక మంగిపూడి మాట్లాడుతూ ‘‘ఆధ్యాత్మిక విలువలకు నెలవు అయిన ప్రాచీన భారతీయ దర్శనంలోని తాత్త్విక ఆలోచనలను, తత్త్వశాస్త్ర సారాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ శతకాన్ని రచించే ప్రయత్నం చేశాను. సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నన్ను దీవించి ‘ముందు మాట’ రూపంలో ఆశీస్సులు అందించటం సంతోషంగా ఉంది. డా.మేడసాని మోహన్ వంటి అవధానుల చేతుల మీదుగా  పుస్తకం ఆవిష్కరించడం భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నా’’ అని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, గురువులకు, నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. న్యూజిలాండ్ నుంచి సంగీత భారతి పాఠశాల అధ్యక్షులు మల్లెల గోవర్ధన్, వారి విద్యార్థినులు విచ్చేసి శతకంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, అమెరికా నుంచి శతకం డిజైనింగ్ చేసిన ‘స్వర మీడియా’ సంస్థ అధ్యక్షులు యక్కలి రాజేష్, రాచకొండ శాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్త్వశాస్త్ర విభాగాధిపతి డా.వానపల్లి వెంకట్రావు, ఆస్ట్రేలియా నుంచి డా. చింతలపాటి, న్యూజిలాండ్ నుంచి తంగిరాల నాగలక్ష్మి, హాంకాంగ్‌ నుంచి జయ పీసపాటి మలేషియా నుండి డాక్టర్ వెంకట ప్రతాప్, కాకినాడ నుంచి డా. దీక్షితులు వివిధ దేశాల తెలుగు సాహిత్యాభిమానులు, రాధిక కుటుంబ సభ్యులు, గురువులు శ్రేయోభిలాషులు, ఈ కార్యక్రమంలో పాల్గొని రాధికకు అభినందనలు తెలియజేశారు. సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రామానికి గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరించారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని