
మరో కీలక ఆదేశంపై బైడెన్ సంతకం
ఒక్కో అమెరికన్ ఖాతాలో 2వేల డాలర్లు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ కీలక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్రతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటీవల 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేసిన బైడెన్.. తాజాగా కరోనాతో దెబ్బతిన్న అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేలా సరికొత్త ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు 1.9 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.138.88 లక్షల కోట్లు) ప్యాకేజీకి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ‘ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. దీంతో అమెరికాలో ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో 2 వేల డాలర్లు చొప్పున జమకానున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో తీవ్ర అవస్థలు పడుతున్న పౌరులకు ఇప్పటికే చెల్లించిన 600 డాలర్లు సరిపోవని బైడెన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రజలను ఆకలితో ఉండబోనీయమని స్పష్టంచేశారు. అద్దె ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయడంపైనా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. ఈ ప్యాకేజీలో భాగంగా 2,000 డాలర్లను ప్రత్యక్ష చెల్లింపుల ద్వారా ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
తన ప్రమాణస్వీకారానికి ముందే ఈ నెల 15న బైడెన్ అమెరికా ఆర్థిక పునరుత్తేజానికి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని, మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టడమే లక్ష్యంగా ఈ భారీ ప్యాకేజీని ఆవిష్కరించారు. 1.9 ట్రిలియన్ డాలర్లను తమ ప్రభుత్వంలో వెచ్చిస్తామన్నారు. ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.. పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిరుద్యోగ భృతి, అధిక సమయం పనిచేసేవారి కనీస వేతనాల పెంపునూ ఈ ‘అమెరికన్ రెస్క్యూ ప్లాన్’లో ప్రస్తావించారు. కరోనా సృష్టించిన సంక్షోభంతో 1.8కోట్ల మంది అమెరికన్లు ఇప్పటివరకు ఇంకా నిరుద్యోగ బీమాపైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా దాదాపు 4 లక్షల చిన్న చిన్న వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడ్డాయి.
ఇదీ చదవండి..
భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు!