Blood donation: ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 08 Jul 2024 20:00 IST

సింగపూర్‌: సింగపూర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జూన్‌ 22న శ్రీ సెంపగ వినాయక దేవాలయ ప్రాంగణంలో  సింగపూర్ తెలుగు సమాజం, శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్- సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్, మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.  ఈ కార్యక్రమానికి సింగపూర్‌లో నివసించే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీలతో పాటు ఇతర భారతీయులు, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తదాన  శిబిరంలో దాదాపు 120 మంది దాతలు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. 

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా రక్త దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తోందన్నారు. అయితే,  భారతీయ మూలాలున్న స్థానిక సింగపూర్ భారతీయులతో కలిసి నిర్వహించడం విశేషం. ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించింది. రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పాలెపు మల్లిక్ తెలిపారు. ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్దన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని