Updated : 07/01/2021 17:38 IST

‘క్యాపిటల్‌’కు నిలువెల్లా గాయాలే..

వాషింగ్టన్‌: యూఎస్‌ క్యాపిటల్‌ హిల్‌.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అగ్రరాజ్య ప్రభుత్వం కొలువుదీరిన ప్రదేశం. అమెరికా సుప్రీంకోర్టు, సెనెట్‌, ప్రతినిధుల సభకు నిలయం. ఇలాంటి భవనంపై నేడు దాడి జరిగింది. ట్రంప్‌ మద్దతుదారుల ముట్టడితో అల్లకల్లోలంగా మారింది. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన క్యాపిటల్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి. అయితే ఈ భవనంలో గతంలోనూ కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా.. నేటి దాడి అంతటి తీవ్రత ఎన్నడూ కన్పించలేదు. ఈ సందర్భంగా క్యాపిటల్‌లో గతంలో జరిగిన ప్రధాన ఘటనలను ఓసారి చూద్దాం..

తొలిసారి అప్పుడే..

యూఎస్‌ క్యాపిటల్‌ హిల్‌ నిర్మాణం 1800 సంవత్సరంలో పూర్తయింది. భవనాన్ని ప్రారంభించిన 14ఏళ్లకు తొలిసారిగా క్యాపిటల్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. అమెరికా-బ్రిటన్‌ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ బలగాలు క్యాపిటల్‌లోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం దక్షిణ, ఉత్తర భాగాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భవనంలో చాలా భాగం కాలిపోయింది. భవంతి పూర్తిగా ధ్వంసమవుతుందనుకున్న సమయంలో అదృష్టవశాత్తూ వర్షం రావడంతో ప్రమాదం తప్పింది. 

బాంబులు, కాల్పులతో దద్దరిల్లి..

 మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌పై హత్యాయత్నం జరిగింది కూడా ఇక్కడే. 1835 జనవరి 30న క్యాపిటల్‌ భవనంలోని హౌస్‌ ఛాంబర్‌లో ఓ కార్యక్రమానికి హాజరై ఆండ్రూ బయటకు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 

1915లో జర్మనీకి చెందిన ఓ వ్యక్తి సెనెట్‌ రెసిప్షన్‌ గదిలో మూడు డైనమైట్‌ స్టిక్‌లను పెట్టాడు. అయితే అర్ధరాత్రి సమయంలో అవి పేలడంతో పెను ప్రమాదం తప్పింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి (జులై 4) రెండు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా ఫైనాన్షియర్లు బ్రిటన్‌కు సహకారం అందించడాన్ని వ్యతిరేకిస్తూ అతడు కాంగ్రెస్‌పై దాడికి యత్నించాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేయడానికి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. 

1954లో ప్యూర్టోరికా స్వాతంత్ర్యం కోరుతూ నలుగురు వ్యక్తులు ప్రతినిధుల సభ గ్యాలరీ నుంచి కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం క్యాపిటల్‌లో ప్యూర్టోరికా జెండాను కూడా ఎగరవేశారు. ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్‌ సభ్యులు గాయపడ్డారు. 

1971, 1983లోనూ క్యాపిటల్‌ భవనం లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. వేల డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది. 

1998లో మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి చెక్‌పాయింట్‌ వద్ద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 2013లో ఓ మహిళ క్యాపిటల్‌లోకి వాహనంతో దూసుకురాగా.. పోలీసులు ఆమెను కాల్చి చంపారు. 

9/11లో తప్పిన ముప్పు

2001 సెప్టెంబరు 9న అమెరికాలో భీకర ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అమెరికా విమానాశ్రయాల నుంచి బయలుదేరిన విమానాలను హైజాక్‌ చేసిన అల్‌ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్‌లోని ట్విన్ టవర్లు, పెంటగాన్‌ను కూల్చేశారు. క్యాపిటల్‌పై కూడా దాడి చేసేందుకు యత్నించగా.. అది విఫలమైంది. క్యాపిటల్‌ భవనాన్ని కూల్చేందుకు బయల్దేరిన విమానంలో ప్రయాణికులు, క్యాబిన్‌ సిబ్బంది హైజాకర్లను అడ్డుకున్నారు. ఈ ఘర్షణలతో ఆ విమానం పెన్సిల్వేనియా సమీపంలో కూలిపోయింది. దీంతో క్యాపిటల్‌కు ప్రమాదం తప్పింది. 

ఇవీ చదవండి..

క్యాపిటల్‌ భవనంలో ఆ 4 గంటలు..

బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తా: ట్రంప్‌

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని