Singapore: ‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్‌లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం

‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్‌లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది.

Published : 05 Jul 2024 20:02 IST

సింగపూర్‌: శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పంచ మహాసహస్రావధాని డా.మేడసాని మోహన్ ‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై రెండు గంటలపాటు ప్రవచనాన్ని అందించారు. యోగిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి కలిసిన రోజు విశిష్టతను వివరించి, ఏకాదశి వ్రతమహిమ గురించి తెలియజేశారు. అనంతరం కురుక్షేత్ర సంగ్రామం ముందు పాండవులు ఆచరించిన ఏకాదశి వ్రత కథను వినిపించారు.  కురుక్షేత్ర సంగ్రామానికి ముందు జరిగిన రాయబార ఘట్టాల నుంచి సంగ్రామ సమాప్తి వరకు జరిగిన సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ.. తిక్కన భారతంలోని పద్యాలను ఉదహరిస్తూ వాటిలోని సాహితీ విశిష్టతను తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధాన్ని నడిపించిన తీరును అద్భుతంగా వివరించారు. తానే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి ధర్మ సంస్థాపనే లక్ష్యంగా యుద్ధ సారథ్యం చేయడంలో, వివిధ సందర్భాల్లో కృష్ణ భగవానుడు ప్రదర్శించిన లీలల వెనక ఉద్దేశాలను చక్కగా వర్ణించి చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. 

శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. ‘డా. మేడసాని మోహన్ ఎంతో అభిమానంగా మా సంస్థను ప్రోత్సహిస్తున్నారు. గతంలోనూ ఆయన ప్రవచనాలను  సింగపూర్ తెలుగు ప్రజలు ఆదరించారు. మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ ప్రత్యేక ప్రవచనం  అందించడం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుంచి కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు పాతూరి రాంబాబు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్, ఆంధ్ర కళావేదిక ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతుల, ప్రతినిధి సాహిత్య జ్యోత్స్న, యూఏఈ నుంచి దినేష్, బహ్రెయిన్‌ తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి ఈ సభను నిర్వహించారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయగా వెయ్యికి మంది పైగా ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని