‘బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సంఘం’ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

 ‘బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం’ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కనుల పండువగా జరిగాయి.

Published : 15 Nov 2021 00:39 IST

అమెరికా: ‘బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం’ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కనుల పండువగా జరిగాయి. మహమ్మారి కరోనా విలయతాండవం తర్వాత ప్రత్యక్షంగా నిర్వహించిన ఈ వేడుకలో సుమారు 1200 మంది పాల్గొన్నారు. పూర్తి నిబంధనలు పాటిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ద్విగిజయంగా కొనసాగించారు. 

ఈ నెల 13న సాయంత్రం 4 గంటల నుంచి దీపావళి వేడకలు ప్రారంభమయ్యాయి. సినీ నటి లయ, గాయని సుమంగళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల కేరింతలు, మహిళలు సంప్రదాయ వస్త్ర ధారణతో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపించింది. తెలుగు కట్టు, బొట్టు, దీపావళి పండుగ, సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చిన్నారులు   తమ నృత్య ప్రదర్శనతో చూపించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కరతాళ ధ్వనులతో అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. మహిళల ఫ్యాషన్ షో ఎంతో అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులకు "చిత్ర లేఖనం" నిర్వహించారు. 

50 సంవత్సరాలుగా ఈ సంస్థ నిర్విరామంగా తెలుగు భాష, సంస్కృతిని ప్రతి తరానికి దగ్గర చేస్తూ, కరోనా ఆపత్కాల సమయంలో అమెరికా, ఇండియాలో కూడా అనేక  సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిందని పలువురు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ‘బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం’ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ తమ సంస్థకూ సామాజిక బాధ్యత కూడా ఒక భాగమని, ఇక ముందూ దీన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ సంస్థకు వెన్నంటి నిలుస్తున్న దాతలను, ఆదరిస్తున్న సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సహ సంస్థలైన తానా, ఆటా, టీడీఎఫ్, కాట్స్ పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ దీపావళి వేడుకల్లో భాగంగా చిన్నారుల ప్రాతినిధ్యంతో చేపట్టిన ‘చేతనా ఫౌండేషన్’ కు అద్భుత స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలని, సామాజిక బాధ్యతగా భావించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు, కార్యవర్గ సభ్యులు పాల్గొని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని